‘జాతీయ జంతువు పెద్దపులిని చంపినా… కొండ చిలువను చంపినా.. ఒకే రకమైన శిక్ష తప్పదని, వణ్యప్రాణి సంరక్షణ చట్టాన్ని అతిక్రమిస్తే ఎవ్వరినీ విడిచి పెట్టేది లేదని శ్రీకాకుళం జిల్లా అటవీ శాఖాధికారి సందీప్ కృపాకర్ గుండాల హెచ్చరించారు. సోమవారం ఆయన మాట్లాడుతూ జిల్లాలో ఇటీవల కొండ చిలువలను హతం చేస్తున్న ఘటనలు అధికమయ్యాయని ఆందోళన వ్యక్తం చేశారు. దీన్ని కూడా చట్టం ప్రకారం నేరంగానే పరిగణిస్తామని స్పష్టం చేశారు.వణ్యప్రాణి సంరక్షణ చట్టం (1972) ప్రకారం షెడ్యూల్–1 కేటగిరీలో పెద్దపులి, నెమలి, జింక, ఫిషింగ్ క్యాట్, కొండ గొర్రె, ఏనుగు, చిరుత పులి, ఎలుగు బంటి తదితర జంతువులతోపాటు కొండ చిలువలను చంపితే చట్టప్రకారం ఏడాది నుంచి ఆరేళ్ల వరకు కఠిన జైలుశిక్షతోపాటు భారీ జరిమానా విధిస్తామని వివరించారు. జిల్లాలో 15 రోజుల్లోనే లావేరు, బూర్జ, గార, నందిగాం, పలాస, ఆమదాలవలస తదితర మండలాలతోపాటు ఏజెన్సీ మండలాల్లోనూ పది వరకు కొండచిలువలను చంపేసినట్లుగా పత్రికల్లో కథనాలు వచ్చాయన్నారు. ఇది నిజంగా దారుణమన్నారు. కొండచిలువలు ఎక్కడైనా తారసపడితే.. వెంటనే తమ అటవీ శాఖాధికారులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. ఈ విషయంలో ప్రజలు మరింత అవగాహన కలిగించుకోవాలన్నారు.