కానిస్టేబుల్ ఉద్యోగంతో జీవితం మారట్లేదనే ఆవేదనతో ఓ కానిస్టేబుల్ చేసిన రాజీనామాను హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ సోమవారం ఆమోదించారు. చార్మినార్ పోలీస్‌స్టేషన్‌లో పనిచేస్తున్న సిద్ధాంతి ప్రతాప్ సెప్టెంబర్‌లో కానిస్టేబుల్ ఉద్యోగానికి రాజీనామా చేస్తూ పోలీస్ కమిషనర్‌కు రాసిన లేఖ రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపింది. పూర్వాపరాలు పరిశీలించిన కమిషనర్.. రాజీనామా ఆమోదిస్తూ ఉత్తర్వులు (డీవో నెం.9583/2019) జారీ చేశారు. ఇంజనీరింగ్ పూర్తిచేసిన ప్రతాప్ 2014లో కానిస్టేబుల్‌గా చేరాడు. అయితే ఉద్యోగంలో చేరిన తనకు పిల్లనిచ్చేందుకు ఎవరూ ముందుకు రావడం లేదని ప్రతాప్ ఆ లేఖలో వాపోయాడు. కానిస్టేబుల్ అంటే రోజంతా పని ఉంటుందని, కాబట్టి తాను పెళ్లి చేసుకోలేనని ఓ అమ్మాయి తనతో నేరుగా చెప్పిందని పేర్కొన్నాడు. అంతేకాదు, పోలీస్ శాఖలో ప్రమోషన్లు అంతంత మాత్రమేనని, 20 ఏళ్ల క్రితం కానిస్టేబుల్‌గా చేరిన వారు కూడా చివరికి హెడ్ కానిస్టేబుల్‌గానే మిగిలిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తూ హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అంజనీకుమార్‌కు రాజీనామా లేఖ రాశాడు. తాజాగా, ప్రతాప్ లేఖను పరిశీలించిన సీపీ.. అతని రాజీనామాను ఆమోదించారు.
