హిందూవులకు కార్తీకమాసం అత్యంత పవిత్రమైనది…నిత్యం దైవపూజలు చేయనివారు కూడా కార్తీకమాసంలో మాత్రం తెల్లవారుజామునే లేచి..కార్తీకస్నానం ఆచరించి..దీపం వెలిగించి పరమశివుడిని పూజిస్తారు. కార్తీకమాసంలో చేసే దీపారాధన వల్ల గత జన్మ పాపాలతో సహా ఈ జన్మపాపాలు కూడా తొలగిపోతాయని శాస్త్రం చెబుతోంది. ఈ మాసంలో నిష్టతో నోములు కూడా ఆచరిస్తారు. కార్తీక మాసంలో ప్రతి రోజు పర్వదినమే. కాబట్టి ఉపవాసాలు ఉంటారు. భగవంతుడిపై మనసు లగ్నం చేయాలంటే..ఉపవాసం ఉండాలని అంటారు. అయితే కొందరు పూర్తిగా ఉదయం నుంచి సాయంత్రం వరకు ఏమి తినకుండా ఉంటారు. కాని ఖాళీ కడుపుతో పూజ చేయకూడదు. కాబట్టి కాస్త పాలు తీసుకోవాలి. అనారోగ్యంతో బాధపడేవాళ్లు ఏదైనా ఒకపండు తినవచ్చు. కొందరు ఒక్క పొద్దు ఉంటారు. పొద్దంతా ఉపవాసం ఉండి..రాత్రి భోజనం చేస్తారు. అయితే ఈ ఆహార పదార్థాల్లో తామనం కలిగించే ఉల్లి, వెల్లుల్లి, వాడరాదు. మరికొందరు ఒక్క పొద్దు పేరుతో రాత్రికి ఏదైనా అల్పాహారం (టిఫిన్) తింటారు. అయితే మినములతో చేసిన గారెలు, దోశలు, ఇడ్లీ వంటివి తినకూడదు. ఇక ఆడవాళ్లు తలస్నానం చేసేటప్పుడు నలుగు పెట్టుకుంటారు..కానీ అది చాలా తప్పు..ఇక కార్తీక వ్రతం పాటించేవారు..ఇంట్లో ఆ వత్రం చేయనివారి చేతి వంట తినరాదు. స్వయంగా వారే వండుకుని తినాలి. అలాగే దీపారాధనలకు తప్ప నువ్వుల నూనెలను ఇతరత్రా అవసరాలకు ఉపయోగించకూడదు. ముఖ్యంగా కార్తీక వత్రం ఆచరించే వారి ఇంట్లో మాంసాహారం వండకూడదు..మద్యం సేవించకూడదు. కొందరు తమ ఇండ్లలో ఆడవాళ్లు మాత్రమే కార్తీక వత్రాలు ఆచరిస్తారు. అంటే నెలరోజులు తెల్లవారుజామునేలేచి కార్తీక స్నానాలు ఆచరించి..దీపాలు వెలిగించి పూజలు చేస్తారు. అలాంటి వారి ఇండ్లలో మిగతా కుటుంబసభ్యులు కూడా విధిగా ఆహార నియమాలు పాటించాల్సిందే. అలా కాకుండా ఉల్లి, వెల్లుల్లితో కూరలు, మాంసాహారాలు వండితే అంతకంటే మహాపాపం ఉండదు..అంతే కాకుండా ఈ కార్తీక మాసంలో వనభోజనాలకు వెళుతుంటారు. అయితే కార్తీక వ్రతం పాటించేవారు..ఈ వనభోజనాలకు వెళితే..ఉల్లి, వెల్లుల్లితో చేసిన ఆహరపదార్థాలు తినకూడదు. కావున..కార్తీక మాసంలో ప్రతి ఒక్కరూ పూజా విధానాలే కాదు ఆహార నియమాలు కూడా నిష్టగా పాటించాలి.
