హుజూర్ నగర్ నియోజకవర్గ ఎన్నికలో పార్టీ విజయం కోసం కృషి చేసిన కార్యకర్తలు, నాయకులు, ప్రజాప్రతినిధులతో తెలంగాణ రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ కేటీఆర్ సమావేశమయ్యారు. పార్టీ విజయం కోసం కృషి చేసిన అందరికీ ఆయన దన్యవాదాలు తెలిపారు. హుజూర్ నగర్ నియోజకవర్గంలో సాధించిన విజయం పార్టీకి టానిక్ లాంటిదని, కొత్త ఉత్సాహాన్ని నింపిందన్నారు. ఇక్కడ సాధించిన విజయంతో ప్రతిపక్షాలు ఇన్నాళ్లుగా చేస్తూ వచ్చిన దుష్ప్రచారాలు, అసత్య ఆరోపణలు, లేవనెత్తిన అర్ధరహిత ప్రశ్నలకు సమాధానం ప్రజలే చెప్పారని కేటీఆర్ అన్నారు.
ఈ విజయం ద్వారా తెలంగాణ ప్రజలకు ముఖ్యమంత్రి శ్రీ కేసిఆర్ నాయకత్వం పైన ఉన్న విశ్వాసానికి నిదర్శనంగా నిలిచిందని, గత కొంతకాలంగా ప్రభుత్వంపై ప్రతిపక్షాలు చేసిన విమర్శలకు ప్రజలే ఓట్ల రూపంలో సమాధానం చెప్పారన్నారు. ప్రజలకు సరైన పరిపాలన అందిస్తే వారే కడుపులో దాచుకుంటారని ముఖ్యమంత్రి పదేపదే చెప్పే మాటలకి, ప్రజలపైన ఆయనకున్న విశ్వసానికి, నిదర్శనం హుజూర్ నగర్ ఎన్నిక అన్నారు. ఈ ఎన్నిక ద్వారా ఏ పార్టీ బలం ఎంతో తేలిపోయిందని, స్వయంగా ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడి సొంత నియోజకవర్గంలోనూ ప్రజలు కాంగ్రెస్‌ని తిరస్కరించారని తెలిపారు.
ప్రజాభిమానం ముందు ప్రతిపక్షాల ప్రచార ఆర్భాటం చిన్నబోయిందన్నారు. గత ఎన్నికల్లో బిజెపి గెలిచిన స్థానాలు గాలివాటమే అని, ఆ పార్టీకి క్షేత్రస్థాయిలో ఉన్న అసలైన బలం ఏమిటో ప్రజలు ఓటు గుద్ది మరీ తెలియజెప్పారన్నారు. టీఆర్ఎస్ పార్టీ గుర్తును పోలిఉన్న స్వతంత్ర అభ్యర్ధికన్నా బీజేపీ వెనకబడిపోయిందన్నారు. ఈ ఎన్నికతో తెలంగాణ రాష్ట్ర సమితి పైన, పార్టీ శ్రేణులపైన మరింత భాద్యత పెరిగిందని, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేయాలన్నారు. ఎన్నికల వేళ ఇచ్చిన హమీలను నెరవేర్చి, హూజుర్ నగర్ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసి, అక్కడ ప్రజల రుణం తీర్చుకోవాలన్నారు. ఈ మేరకు స్థానిక ఎమ్మెల్యే, మంత్రి అక్కడ ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు ప్రత్యేక కృషి చేయాలన్నారు. ప్రజలకు ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలను వివరించి, రానున్న మున్సిపల్ ఎన్నికల్లోనూ ఇలాంటి విజయమే సాధించాలని కోరారు. మునిసిపల్ ఎన్నికలకు సంబంధించి స్థానిక ఎమ్మెల్యేలు బాధ్యత తీసుకొని ప్రణాళికాబద్ధంగా పక్కా వ్యూహంతో ముందుకు పోవాలని సూచించారు.