కర్నూల్ జిల్లా కల్లూరు మండలంలో ఆదివారం దారుణ హత్య జరిగింది. పొలం కోసం పెద్దకొట్టాల గ్రామానికి చెందిన ఎద్దుల పెద్దారెడ్డి అనే వ్యక్తిని ప్రత్యర్థులు అతి కిరాతకంగా నరికి చంపారు. పెద్దకొట్టాల – చిన్నకొట్టాల గ్రామాల మధ్యలో ఈ ఘటన జరిగింది. కుటుంబ సభ్యులు, పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. పెద్దకొట్టాల గ్రామానికి చెందిన ఎద్దుల పెద్దారెడ్డి (42) కర్నూలులోని నాగేంద్రనగర్‌లో నివాసం ఉంటున్నాడు. ఈయనకు 22 ఎకరాల పొలం ఉంది. దానిని సాగుచేసుకుంటూ జీవిస్తున్నాడు. 2004లో అదే గ్రామానికి చెందిన మద్దిలేటి రెడ్డి వద్ద ఎకరా రూ. 2 లక్షల చొప్పున రెండెకరాల పొలం ఆయన కొనుగోలు చేశాడు. తర్వాత భూముల ధరలు భారీగా పెరగడంతో తన పొలం తిరిగి ఇవ్వాలని 2013లో మద్దిలేటిరెడ్డి పేచీ పెట్టాడు. ఈ విషయంలో ఇరువురి మధ్య గొడవ జరగడంతో పంచాయితీ ఉలిందకొండ పోలీస్ స్టేషన్‌కు చేరింది. సమస్యను కోర్టులో తెల్చుకోవాలని పోలీసులు సూచించడంతో వారు కోర్టును ఆశ్రయించారు. అయితే, కోర్టు తీర్పు పెద్దారెడ్డికి అనుకూలంగా రావడంతో మద్దిలేటిరెడ్డి కక్ష పెంచుకున్నాడు. ఎలాగైనా తన పొలాన్ని తిరిగి దక్కించుకోవాలని వివిధ కుట్రలు పన్నాడు. ముందుగా తన భార్య సూర్యకాంతం పట్ల అసభ్యంగా ప్రవర్తించినట్లు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసి ఇబ్బందులకు గురి చేశాడు. తర్వాత పొలానికి వెళ్తుండగా వెంబడించి ద్విచక్ర వాహనంతో ఢీకొట్టించాడు. అయినా, పెద్దారెడ్డి ప్రాణాలతో బయటపడటంతో ఈసారి హత్యకు ప్లాన్ గీశాడు.
పెద్దకొట్టాల గ్రామానికి చెందిన చిన్న తిమ్మారెడ్డి అనే వ్యక్తి అనారోగ్యంతో మృతి చెందాడని తెలియడంతో పెద్దారెడ్డి ఆదివారం గ్రామానికి వచ్చాడు. అంత్యక్రియల్లో పాల్గొని మార్గమధ్యంలోని మిరపపొలంలో ఉన్న బోరుబావి వద్ద స్నానం చేసి కర్నూలుకు బయలుదేరాడు. అప్పటికే పొలంలో మాటు వేసి ఉన్న మద్దిలేటిరెడ్డి కుటుంబసభ్యులు ఒక్కసారిగా వేటకొడవళ్లు, గొడ్డళ్లతో అతి కిరాతకంగా నరికి చంపారు. విషయం తెలుసుకున్న కర్నూలు రూరల్ సీఐ శ్రీనాథరెడ్డి, ఉలిందకొండ ఎస్‌ఐ శంకరయ్య, కె. నాగలాపురం ఎస్‌ఐ కేశవ్ తమ సిబ్బందితో సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. హత్యకు దారి తీసిన పరిస్థితులపై ఆరా తీశారు. డాగ్‌స్క్వాడ్‌ను పిలిపించి ఆధారాలు సేకరించే ప్రయత్నం చేశారు. తర్వాత మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం అంబులెన్స్‌లో కర్నూలు ప్రభుత్వాసుపత్రికి తరలించారు.