శనివారం క్యాబినెట్ సమావేశం అనంతరం సీఎం కేసీఆర్ ఈ నెల 5వ తేదీ లోపు ఆర్టీసీ ఉద్యోగులను విధులలో చేరడానికి అవకాశం కల్పించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో పనిచేస్తున్న ఆర్టీసీ ఉద్యోగులు తిరిగి విధుల్లో చేరడానికి సిద్ధంగా ఉన్న వారికి పోలీస్ శాఖ నుండి పూర్తి రక్షణ, భద్రత కలిపిస్తామని సీపీ వీసీ సజ్జనార్ తెలిపారు. యూనియన్ లీడర్ల బెదిరింపులకు భయపడవద్దని తెలిపారు. ఆర్టీసీ ఉద్యోగులు ఎవరైనా విధుల్లో చేరడానికి సిద్ధంగా ఉంటే నిర్భయంగా చేరవచ్చన్నారు. సీఎం కేసీఆర్ పిలుపుమేరకు విధుల్లో చేరుతున్న ఉద్యోగులను ఎవరైనా బెదిరించినా, భౌతిక దాడులకు పాల్పడినా, వారికి ఏ విధమైన నష్టం కలుగజేసినా అట్టి వారిపై చట్టప్రకారం సైబరాబాద్ పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటారని హెచ్చరించారు. ఉద్యోగంలో తిరిగి చేరాలనుకునే వారిని ఎవరైనా ఉద్దేదపూర్వకంగా అడ్డగించినా, ఘెరావ్ చేసినా, బెదిరింపులకు పాల్పడినా వెంటనే సంబంధిత పోలీస్ స్టేషన్లో నేరుగా ఫిర్యాదు చేయవచ్చని భరోసానిచ్చారు. డయల్ 100 లేదా సైబరాబాద్ పోలీస్ వాట్సాప్ నెం.9490617444 సంప్రదించాలన్నారు.