ఏపీలో ఇసుక కొరతతో భవన నిర్మాణ కార్మికులు చనిపోతున్నారంటూ టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్‌కల్యాణ‌్‌లు జగన్ సర్కార్‌పై తీవ్ర విమర్శలు చేస్తున్న సంగతి తెలిసిందే. మొన్న మంగళగిరిలో లోకేష్ ఇసుక పేరుతో తూతూమంత్రంగా నాలుగుగంటలపాటు నిరాహాదీక్ష చేస్తే..ఇవాళ పవన్ కల్యాణ్ భవననిర్మాణ కార్మికుల కోసం లాంగ్ మార్చ్ అంటూ కేవలం 3 కి.మీ.లు నడిచాడు. వరదల నేపథ్యంలో జలశయాలు నిండుకోవడంతో ఇసుక రవాణాలో తాత్కాలికంగా ఎదురైన ఇబ్బందులతో కొంత మేర ఇసుక కొరత ఏర్పడిన సంగతి వాస్తవమే..కాని ప్రభుత్వం మాత్రం చిత్తశుద్దితో ప్రజలకు చవక ధరకే నాణ్యమైన ఇసుకను అందించేందుకు నూతన ఇసుక విధానం తీసుకువచ్చింది. ఈ విధానం ద్వారా ఇసుక దోపిడీకి చెక్ పడడమే కాకుండా స్థానిక యువతకు ఉపాధి దొరుకుతుంది. అయితే చంద్రబాబు, లోకేష్, పవన్ కల్యాణ్‌లు మాత్రం ఇసుక కొరత పేరుతో శవరాజకీయం చేయడానికి కూడా వెనుకాడడం లేదు. ఇసుక కొరతతో ఉపాధి లేక ఇప్పటికే 10 మంది భవన నిర్మాణ కార్మికులు చనిపోయారని..ఇవన్నీ ప్రభుత్వం చేసిన హత్యలని బాబు అండ్ కో దుష్ప్రచారం మొదలుపెట్టారు. అయితే కొందరు వ్యక్తిగత కారణాలతో ఆత్మహత్య చేసుకుంటే..టీడీపీ నేతలు వాళ్లని భవన నిర్మాణ కార్మికులంటూ శవ రాజకీయాలకు పాల్పడుతున్నారని తాజాగా జరిగిన ఘటనతో రుజువైంది.
తాడేపల్లి మండలం, ఉండవల్లిలో ఓ అపార్ట్‌మెంట్‌లో వాచ్‌మెన్‌గా పని చేస్తున్న నాగరాజు శుక్రవారం రాత్రి ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తాడేపల్లి పోలీసులు నాగరాజు మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం..మంగళగిరి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే మృతుడు నాగరాజు తాపీ పని చేసేవాడని, ఇసుక కొరత వల్ల, ఆర్థిక ఇబ్బందులతో ఉరివేసుకున్నాడని స్థానిక టీడీపీ నేతలు తప్పుడు ప్రచారం చేశారు. మంగళగిరి నేతలకు ఈ విషయాన్ని చేరవేశారు. ఇంకేముంది టీడీపీ నేతలు స్థానిక కార్మిక సంఘ నాయకులతో కలిసి ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకున్నారు. ఇసుక కొరత వల్లే ఉరి వేసుకున్నారని మీడియాకు చెప్పండి..శవాన్ని మాకు అప్పగిస్తే..రోడ్డుపై ఆందోళన చేస్తాం..మీకు డబ్బులు కూడా ఇస్తాం..మిమ్మల్ని పరామార్శించేందుకు చంద్రబాబు, లోకేష్‌లు వస్తారని మృతుడు నాగరాజు కుటుంబ సభ్యులపై వత్తిడి చేశారు. అయితే ఇంట్లో సమస్యలతో చనిపోయాడు..ఇసుకతో మాకేం సంబంధం లేదని నాగరాజు కుటుంబసభ్యులు టీడీపీ నేతలకు ఖరాకండిగా చెప్పేశారు. అయినా వినకుండా ఆందోళన చేద్దామని టీడీపీ నేతలు బలవంతం చేయడంతో మీ డబ్బులు వద్దు..మీ రాజకీయాలు వద్దు అని..నాగరాజు కుటుంబసభ్యులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడంతో టీడీపీ నేతలు సైలెంట్ అయ్యారు. మద్యానికి బానిసైన నాగరాజు భార్యతో జరిగిన గొడవల నేపథ్యంలో ఆత్మహత్య చేసుకుంటే.ఇసుక పేరుతో శవరాజకీయం చేద్దామనుకున్న టీడీపీ నేతల పన్నాగం పారలేదు. ఈ విషయం తెలిసిన ప్రజలు టీడీపీ నేతల శవరాజకీయాలను అసహ్యించుకుంటున్నారు.