ఏపీలో ఇసుక కొరతపై టీడీపీ అధినేత చంద్రబాబు, ఆయన తనయుడు లోకేష్, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌లు చేస్తున్న రాజకీయంపై వైసీపీ మంత్రి కురసాల కన్నబాబు విరుచుకుపడ్డారు. వర్షాలు సమృద్ధిగా కురవడంతో రాష్ట్రంలోని 260 రీచ్‌లకు గానూ కేవలం 60 రీచ్‌లలో మాత్రమే ఇసుక లభ్యమవుతోందని , అందుకే ఇసుక డిమాండ్, సప్లైలో అంతరం తలెత్తిందని మంత్రి అన్నారు. అయితే ప్రతిపక్ష నేత చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేశ్, పవన్ కల్యాణ్‌కు మాత్రం ఇవేమీ పట్టడం లేదని.. కేవలం ఇసుకతో రాజకీయం చేయాలని మాత్రమే చూస్తున్నారని కన్నబాబు మండిపడ్డారు. గుంటూరులో సొంత పుత్రుడు లోకేశ్ దీక్ష చేస్తే.. వైజాగ్‌లో దత్తపుత్రుడు పవన్ దీక్ష చేస్తున్నారని ఎద్దేవా చేశారు. కృత్రిమ పోరాటాలు చేయడం వారికే పార్టనర్లకే చెల్లిందని ఆయన తీవ్ర విమర్శలు చేశారు. నిజంగా పవన్ కల్యాణ్‌కు చిత్తశుద్ధి ఉంటే గత ఐదేళ్లుగా జరిగిన ఇసుక మాఫియాపై ఎందుకు నోరు మెదపలేదని మంత్రి కన్నబాబు ప్రశ్నించారు. వరదల వల్ల ఇసుక కొరత ఏర్పడటంపై చంద్రబాబు, లోకేష్, పవన్ కల్యాన్‌కు సంతోషం గా ఉంది. అందుకే కృత్రిమ పోరాటాలు చేస్తున్నారు. నిజానికి వైజాగ్‌లో కొత్తగా పవన్ లాంగ్ మార్చ్ చేసేది ఏముంది. గత ఐదేళ్లు చేస్తూనే ఉన్నారు కదా..అని కన్నబాబు ఎద్దేవా చేశారు. ఇక పవన్ కల్యాణ్ ఇసుకడ్రామాలకు మిగిలిన ప్రతిపక్షాలేవి మద్దతు పలకడం లేదని మంత్రి చెప్పారు. . బీజేపీ పవన్ కవాతుకు హాజరు కామని తేల్చిచెబితే.. లెఫ్ట్ పార్టీలు కూడా పవన్‌తో వేదిక పంచుకోమని చెప్పాయని, పవన్ చిత్తశుద్ధిపై మిగిలిన ప్రతిపక్షాలకు కూడా నమ్మకంలేదని కన్నబాబు వెటకారం ఆడారు. పవన్ దీక్షకు టీడీపీ నేతలు జన సమీకరణ చేస్తున్నారనే వార్తలు వస్తున్నాయి. చంద్రబాబు హయాంలో బొగ్గు గనుల్లో తవ్వినట్లు నదిలో అక్రమంగా ఇసుకను తవ్వారు. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ చంద్రబాబు ప్రభుత్వానికి రూ. 100 కోట్లు జరిమానా విధించింది. ఇసుక అక్రమాలపై వార్తలు రాసిన రిపోర్టర్లపై టీడీపీ నేతలు దాడి చేశారు. భవన నిర్మాణ కార్మికుల నిధులను చంద్రబాబు పక్కదోవ పట్టించారు. అక్రమ ఇసుకను అడ్డుకున్న మహిళలపై చంద్రబాబు లాఠీచార్జీ చేయించారు. ఇసుక అక్రమ రవాణా అడ్డుకున్న వారిని లారీలతో తొక్కించి చంపించారు. మరి అప్పుడు పవన్ కల్యాణ్ ఎక్కడికి పోయారు’ అని కన్నబాబు ప్రశ్నించారు. అయినా చంద్రబాబు, పవన్ కల్యాణ్ బంధం ఏనాడు విడిపోలేదు.. వారి లాంగ్ జర్నీ కొనసాగుతూనే ఉందని..కన్నబాబు తీవ్ర ఆరోపణలు చేశారు. మొత్తంగా చంద్రబాబు, పవన్‌కల్యాణ్‌ల రహస్యబంధం ఇంకా కొనసాగుతూనే ఉందని, ఎన్నికల్లో ఘోర పరాజయం పాలైనా..ఇప్పటికీ చంద్రబాబు చెప్పినట్లే పవన్ డ్రామాలు ఆడుతున్నారని కన్నబాబు మండిపడ్డారు.
