గత చంద్రబాబు సర్కార్ హయాంలో అమరావతి తర్వాత అతిపెద్ద ల్యాండ్ స్కామ్..విశాఖ భూముల కుంభకోణం. నాటి మంత్రి గంటా, టీడీపీ ఎమ్మెల్యేలతో సహా అమరావతి పెద్దల వరకు హస్తం ఉన్నట్లు అప్పట్లో స్వయానా మరో టీడీపీ మంత్రి అయ్యన్నపాత్రుడు చేసిన ఆరోపణలు తీవ్ర కలకలం రేపాయి. అధికారాన్ని అడ్డం పెట్టుకుని టీడీపీ నేతలు యదేచ‌్ఛగా భూకబ్జాలకు పాల్పడ్డారు. కలెక్టర్ లెక్కల ప్రకారమే జిల్లాలో 10,000 ఎకరాలకు పైగా భూమి లెక్కలు తారుమారయ్యాయి. అంటే దాదాపు 25,000 కోట్ల విలువ చేసే భూమి మాయం అయిపోయిందన్నమాట. ఈ భూకుంభకోణంలో పోలీస్ స్టేషన్లలో దాదాపు 2875 కేసులు నమోదయ్యాయి. కానీ సిట్ అధికారులు మాత్రం వాటిలో కేవలం 336నే పరిగణలోకి తీసుకున్నారు. విశాఖ జిల్లాలో ఉన్న 3022 గ్రామాల్లో దాదాపు 2లక్షల ఎఫ్.ఎం.బి సర్వే నెంబర్లలో 16,000 నెంబర్లు గల్లంతయ్యాయి. సుమారు లక్ష ఎకరాల భూమి అన్యాక్రాంతం అయినట్టు చర్చ జరిగింది. కానీ ప్రభుత్వ పెద్దల ఒత్తిడితో దాన్ని 10,000 ఎకరాలుగా మాత్రమే చిత్రించే ప్రయత్నం చేసారు. నాటి ప్రతిపక్ష వైసీపీ విశాఖ భూకుంభకోణంపై గట్టిగా పోరాడింది. దీంతో అప్పటి బాబు సర్కార్ తూతూమంత్రంగా సిట్ విచారణ జరిపించి..టీడీపీ నేతలకు క్లీన్ చిట్ ఇప్పించి…కేసును విజయవంతంగా పక్కదారి పట్టించింది. తాజాగా వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం జగన్ విశాఖ భూకుంభకోణంపై సిట్ కమీషన్‌ను నియమించారు. శుక్రవారం నాడు సిట్ కమీషన్ విశాఖలో విచారణను మొదలుపెట్టింది. ఈ సిట్ కమీషన్‌లో రిటైర్డ్ ఐఏఎస్ అధికారి డాక్టర్ విజయ్ కుమార్, మరో విశ్రాంత ఐఏఎస్ అధికారి వైవీ అనురాధ. రిటైర్డ్ న్యాయమూర్తి టి.భాస్కరరావులు సభ్యులుగా ఉన్నారు. తొలిరోజు వచ్చిన 79 దరఖాస్తుల్లో టీడీపీకి చెందిన మాజీ ఎమ్మెల్యేలపై ఎక్కువగా ఫిర్యాదులు ఉన్నాయి. టీడీపీ నేత, పిఠాపురం మాజీ ఎమ్మెల్యే సత్యనారాయణ వర్మ అతని అనుచరులు రెవెన్యూ అధికారుల సహకారంతో తమ స్థలాన్ని ఆక్రమించారని పిళ్లా పాపయ్య పాత్రుడు అనే బాధితుడు సిట్ కమీషన్ ముందు వాపోయాడు. అలాగే పెందుర్తి మాజీ ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి తమ భూములు తమకు దక్కకుండా చేశారని, పరవాడ మండలం ఈదులపాక బోనంగికి చెందిన జంగాల రమేష్ ఆరోపించారు. వీరితో పాటుగా చాలామంది రైతులు తమ భూములని టీడీపీ నేతలు, అధికారులు కుమ్మక్కై అక్రమంగా లాక్కున్నారని, తిరిగి తమ భూములని ఇప్పించాలని సిట్‌ని కోరారు. విశాఖ భూకుంభకోణంపై సిట్ కమీషన్ విచారణ చేపట్టడంతో బాధితులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. టీడీపీ నేతలు పాల్పడిన భూ కబ్జాలను సిట్ అధికారుల ముందు ఏకరువు పెడుతున్నారు. మొత్తంగా తీగ లాగితే డొంక కదిలినట్లు విశాఖ భూకుంభకోణంలో టీడీపీ మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేల భూబాగోతాలన్నీ బయటపడే అవకాశం ఉంది. భూదందాలకు పాల్పడిన టీడీపీ నేతలకు, అమరావతి పెద్దలకు జరిగిన లావాదేవీలపై కూడా సిట్ కమీషన్ ఆరా తీస్తున్నట్లు సమాచారం. సిట్ కమీషన్ నిష్పక్షపాతంగా విచారణ జరిపిస్తుండడంతో టీడీపీ నేతల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయనే చెప్పాలి.