టీడీపీకి రాజీనామా చేసిన వల్లభనేని వంశీ వైసీపీలో చేరడం దాదాపుగా ఖరారు అయింది. ఒకవైపు చంద్రబాబు కేశినేని నాని, కొనకళ్ల నారాయణతో వంశీని బుజ్జగించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే వీరిద్దరు వంశీ విషయంలో చేతులెత్తేసినట్లు సమాచారం. కాగా నిన్న రాష్ట్ర అవరతణ దినోత్సవాల అనంతరం మంత్రులు కొడాలి నాని, పేర్నినానిలు వంశీ నివాసానికి వెళ్లారు. ఈ సందర్భంగా పార్టీలో చేరికపై ముగ్గురి మధ్య చర్చ జరిగినట్లు తెలుస్తోంది. టీడీపీ నుంచి వస్తున్న వత్తిళ్లు.. తన చేరికపట్ల నియోజకవర్గంలో వైసీపీ నేతల నుంచి వస్తున్న వ్యతిరేకతను వంశీ మంత్రుల దృష్టికి వెళ్లగా..అదేమిలేదని..యార్లగడ్డ వెంకట్రావుకు ఎమ్మెల్సీ పదవి ఇస్తామని, అలాగే వంశీకి పార్టీలో సముచిత ప్రాధాన్యం ఇస్తామని మంత్రులు హామీ ఇచ్చినట్లు విశ్వసనీయ వర్గాల భోగట్టా..అయితే ఈ సందర్భంగా వంశీ చంద్రబాబుకు రాసిన లేఖలో వైసీపీ నేతల వేధింపుల వల్లే పార్టీని వీడుతున్నట్లు చెప్పడం పట్ల మంత్రులు ప్రస్తావించారు. వంశీ లేఖ పార్టీ ఇమేజ్ డ్యామేజీ చేసేలా ఉందని మంత్రులు అభిప్రాయపడినట్లు తెలుస్తోంది. మంత్రుల అభిప్రాయంతో ఏకీభవించిన వంశీ మొత్తంగా వైసీపీలో చేరేందుకు సూత్రపాయంగా అంగీకరించినట్లు సమాచారం. ఈ నెల 3 లేదా 4 న వంశీ వైసీపీలో చేరేందుకు ముహూర్తం ఖరారు అయిందని ఆయన అనుచరులు అంటున్నారు. కాని వైసీపీ నేతలు మాత్రం ఈ నెల 7 న వంశీ పార్టీలో చేరుతారంటూ చెబుతున్నారు. కాగా మంత్రులు తమ నాయకుడి ఇంటికి వచ్చి వెళ్లగానే..ఆయన ఆఫీస్ వద్ద ఉన్న టీడీపీ జెండాలను, ఫ్లెక్సీలను వంశీ అనుచరులు పీకిపడేశారు. దీంతో వంశీ వైసీపీలో చేరడం ఖాయమైందని గన్నవరంలో ప్రచారం జరుగుతోంది. కాగా వంశీ బాటలోనే మరికొందరు టీడీపీ ఎమ్మెల్యేలు వైసీపీలో చేరబోతున్నట్లు ఏపీ రాజకీయవర్గాల్లో చర్చ జరుగుతుతోంది. మొత్తంగా వల్లభనేని వంశీ వైసీపీలో చేరుతున్నట్లు వస్తున్న వార్తలు ఏపీ రాజకీయాల్లో సంచలనంగా మారాయి.
