గన్నవరం టీడీపీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఇచ్చిన షాక్ నుంచి కోలుకోకముందే చంద్రబాబుకు మరో ఇద్దరు ఎమ్మెల్యేలు కోలుకోలేని దెబ్బ కొట్టబోతున్నారు. గన్నవరంలో మొదలైన ప్రకంపనలు విశాఖ జిల్లాకు పాకాయి. విశాఖలో టీడీపీ నుంచి గెలిచిన నలుగురు ఎమ్మెల్యేలలో ఇద్దరు ఎమ్మెల్యేలు త్వరలోనే పార్టీకి గుడ్‌బై చెప్పబోతున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఆ ఇద్దరు ఎమ్మెల్యేలలో ఒకరు విశాఖ నార్త్ ఎమ్మెల్యే టీడీపీ సీనియర్ నేత గంటా శ్రీనివాస్‌రావు అయితే..మరొకరు విశాఖ సౌత్ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్‌కుమార్. టీడీపీ ఘోర పరాజయం తర్వాత గంటా శ్రీనివాస్‌రావు పార్టీ మారుతాడంటూ ప్రచారం జరుగుతోంది. ఒకదశలో ఎన్నికలకు ముందే గంటా వైసీపీలో చేరుతాడంటూ వార్తలు వచ్చాయి.అయితే అప్పుడు అవి కార్యరూపం దాల్చలేదు. అయితే తాజాగా మరోసారి గంటా పార్టీ మారడం ఖాయమంటూ విశాఖ టీడీపీలో చర్చ జరుగుతోంది. ఇప్పటికే గంటా వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డితో సంప్రదింపులు జరిపాడంటూ వార్తలు వినిపిస్తున్నాయి. అయితే గంటా వైసీపీలోకి కాదు..బీజేపీలో చేరుతాడంటూ మరో వార్త వినిపిస్తుంది. అయితే గంటా పార్టీ మారడం ఖాయమని ఆయన అనుచరులు బల్లగుద్ది మరీ చెబుతున్నారు. ఇక మరో ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్‌కుమార్‌కు , స్థానిక టీడీపీ అర్బన్ అధ్యక్షుడు రెహ్మాన్‌కు మధ్య విబేధాలు తారాస్థాయికి చేరుకున్నాయి. . గన్నవరంలో దేవినేని ఉమతో వంశీ ఎలా ఇబ్బందులు ఫేస్ చేశాడో…సేమ్ టు సేమ్ రెహ్మాన్‌తో వాసుపల్లి గణేష్‌కుమార్ కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు సమాచారం.దీంతో వాసుపల్లి గణేష్‌కుమార్ కూడా పార్టీ మారే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. మొత్తంగా వంశీ బాటలో గంటా, గణేష్‌కుమార్‌లు కూడా టీడీపీని వీడడం దాదాపుగా ఖరారు అయింది. వీరిద్దరి బాటలో టీడీపీ నుంచి వలసలు ఊపందుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. అదే జరిగితే చంద్రబాబుకు ప్రతిపక్ష హోదా గల్లంతు అయ్యే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. వంశీతో మొదలైన ప్రకంపనలు టీడీపీని భూస్థాపితం చేసే వరకు ఆగేలా లేవు. మొత్తంగా గంటా, గణేష్‌కుమార్‌ల రాజీనామా వార్తలు టీడీపీలో కలకలం రేపుతున్నాయి.