తెలంగాణేర్పడిన తర్వాత టీఎస్‌ఐపాస్ ద్వారా ప్రపంచ పారిశ్రామికవర్గాలను ఆకర్షించి, అందరి ప్రశంసలు అందుకున్న సీఎం కేసీఆర్ నాయకత్వంలోని టీఆర్ఎస్ ప్రభుత్వం.. దేశానికే ఆదర్శంగా తొలిసారి సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమ (ఎమ్మెస్‌ఎంఈ)లకు ప్రత్యేకంగా పారిశ్రామిక పార్క్‌ను ఏర్పాటుచేసింది. యాదాద్రి జిల్లా చౌటుప్పల్ మండలం దండుమల్కాపురంలో 435 ఎకరాల్లో నిర్మించిన టీఎస్‌ఐఐసీ -టీఐఎఫ్- ఎమ్మెస్‌ఎంఈ- గ్రీన్ ఇండస్ట్రియల్ పార్కును రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖల మంత్రి కే తారకరామారావు శుక్రవారం ప్రారంభించనున్నారు.
ఇక్కడ 450 పరిశ్రమలు ఏర్పాటుకానున్నాయి. వీటితో రూ.1553 కోట్ల పెట్టుబడులు రానుండగా.. 20 వేల మందికి ప్రత్యక్షంగా, 15వేల మందికి పరోక్షంగా.. మొత్తం 35 వేల మందికి ఉపాధి లభించనున్నది. ఈ పార్క్ సమీపంలో మరో 1500 ఎకరాలు సేకరిస్తున్నారు. ఆ స్థలాన్ని కూడా పరిశ్రమలకు కేటాయిస్తే.. మరో 50-60 వేలమందికి ఉపాధి లభిస్తుంది.
ఇక్కడ పరిశ్రమల ఏర్పాటుకు భారీ డిమాండ్ ఉండటంతో భూసేకరణను వేగంగా చేపడుతున్నారు. పరిశ్రమలను ఔటర్‌రింగురోడ్డు అవతలికి తరలించాలని ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయించింది. ఈ క్రమంలోనే దండుమల్కాపురంలో పార్క్ ఏర్పాటు చేశారు. ఇప్పటికే 70 నుంచి 80శాతం పనులు పూర్తయ్యాయి.