తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి,అధికార టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రంలో ఐటీ అభివృద్ధిని ప్రతిష్ఠాత్మకంగా తీసుకొన్న మంత్రి కేటీఆర్.. ప్రతి విదేశీ పర్యటనతోపాటు ఐటీ దిగ్గజ సంస్థల ప్రతినిధులతో జరిపిన చర్చల్లో ద్వితీయ శ్రేణి నగరాలకు ఉండే సానుకూలతలను వివరించారు. బెంగళూరు సమీపంలోని మైసూర్‌లో ఐటీరంగం విస్తరించినట్టే హైదరాబాద్ చుట్టుపక్కల గల ద్వితీయశ్రేణి నగరాలు ఐటీ పరిశ్రమల స్థాపనకు ఏవిధంగా అనుకూలమో వివరించి పలు అంతర్జాతీయ కంపెనీల రాకకు కారణమయ్యారు.
వరంగల్, ఖమ్మం జిల్లాల్లో..
వరంగల్-హైదరాబాద్ జాతీయ రహదారిపై మడికొండ వద్ద ఇప్పటికే 45 ఎకరాల్లో ఐటీ పార్కును ఏర్పాటుచేయడంతోపాటు అక్కడ రూ.4.5 కోట్ల వ్యయంతో ఇంక్యుబేషన్ సెంటర్ పూర్తయింది. ఈ సెజ్‌లోనే ఐదెకరాల్లో సీయెంట్ కంపెనీని స్థాపించారు. అంతర్జాతీయ ఐటీ కంపెనీ అయిన ఇన్ఫోసిస్ కూడా వరంగల్‌లో భారీ యూనిట్‌ను ప్రారంభించాలని భావిస్తున్నది. ఖమ్మంలో 1.21 ఎకరాల్లో రూ. 25 కోట్లతో కొత్త ఐటీ హబ్‌ను స్థాపించాలని నిర్ణయించిన ప్రభుత్వం.. అక్కడ మొత్తం 15 కంపెనీలకు స్థలాలు కేటాయించి 2,500 మందికి ఉపాధి కల్పించేలా చర్యలు చేపడుతున్నది.
కరీంనగర్‌లో ఐటీ టవర్ నిర్మాణ పనులు పూర్తి
కరీంనగర్‌లో గతేడాది రూ.25 కోట్లతో ప్రారంభమైన ఐటీ టవర్ నిర్మాణ పనులు పూర్తికావస్తున్నాయి. ఈ టవర్‌లో 62 వేల చదరపు అడుగుల ఆఫీస్ స్పేస్ అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు. గ్రౌండ్ ఫ్లోర్‌లో లెర్నింగ్ సెంటర్‌తోపాటు, ఏసీ, నాన్ ఏసీ క్యాంటీన్లను ఏర్పాటుచేస్తున్నారు. ఈ టవర్ ద్వారా దాదాపు మూడు వేలమందికి ఉపాధి లభించే అవకాశమున్నది.
నిజామాబాద్‌లో రూ.50 కోట్లతో…
నిజామాబాద్ జిల్లాలో ఐటీ పార్కు ఏర్పాటుకు తొలుత రూ.25 కోట్లు కేటాయించారు. అక్కడ కార్యాలయాలను ఏర్పాటుచేసేందుకు 45కుపైగా కంపెనీలు ముందుకురావడంతో కేటాయింపులను రూ.50 కోట్లకు పెంచి 50 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో రెండు ఐటీ టవర్‌లను నిర్మిస్తున్నారు. తద్వారా 2,500 మందికి ఉపాధి లభించే అవకాశమున్నది.
నేడు మహబూబ్‌నగర్‌లో భూమిపూజ
మహబూబ్‌నగర్ జిల్లాలో నిర్మించే ఐటీ టవర్‌కు మంత్రి శ్రీనివాస్‌గౌడ్ గురువారం (అక్టోబర్ 31న) భూమిపూజ చేయనున్నారు. ఈ కారిడార్‌లో అంతర్జాతీయస్థాయి ప్రమాణాలతో సాఫ్ట్‌వేర్, కాలుష్య రహిత పరిశ్రమలను ఏర్పాటుచేసి స్థానిక యువతకు ఉపాధి కల్పించనున్నారు. మహబూబ్‌నగర్‌లోని ఎదిర శివారులో నిర్మించే టవర్‌కు ఐటీశాఖ రూ.25 కోట్లు మంజూరుచేసింది. నాలుగు ఎకరాల్లో నిర్మితమయ్యే ఈ టవర్ పూర్తయిన వెంటనే దాదాపు 40 కంపెనీల కార్యాలయాలు ఏర్పాటయ్యేలా టీఎస్‌ఐఐసీ కార్యాచరణ రూపొందించింది.
ద్వితీయశ్రేణి నగరాల్లో ప్రత్యేక రాయితీలు
ద్వితీయశ్రేణి నగరాల్లో కార్యాలయాలను స్థాపించే ఐటీ సంస్థలకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ప్రోత్సాహకాలను అందజేయనున్నది. ఇందుకు సంబంధించిన విధి విధానాలు అందుబాటులోకి రావడంతో పలు ఐటీ కంపెనీలు ద్వితీయశ్రేణి నగరాల బాటపడుతున్నాయి.
ప్రత్యేక రాయితీలకు ప్రతిపాదనలు
– ప్రతి పట్టణంలో మొదటి ఐదు ఐటీపార్కులు, ఐటీ కంపెనీలకు తొలి మూడేండ్లు మున్సిపల్ ట్యాక్స్‌లను రీయింబర్స్ చేస్తారు.
– ఐటీ ఈవెంట్ల నిర్వహణకయ్యే ఖర్చులో 50 శాతం లేదా రూ.5 లక్షలు (ఏది తక్కువైతే ఆ మొత్తాన్ని) రీయింబర్స్ చేస్తారు.
– ద్వితీయశ్రేణి నగరాల్లో నిర్వహించే ఎగ్జిబిషన్లలో 9 చదరపు మీటర్ల స్థలంలో స్టాళ్లు ఏర్పాటు చేసుకునే జాతీయ, అంతర్జాతీయ ఐటీ కంపెనీలకు అద్దెలో 50 శాతం సబ్సిడీ లేదా రూ.50 వేలు (ఏది తక్కువైతే అది) ఇస్తారు.
– ఐటీ కంపెనీలు ప్రారంభమైన నాటినుంచి ఐదేండ్లవరకు విద్యుత్ చార్జీల్లో ప్రతి యూనిట్‌కు రూపాయి చొప్పున ఫిక్స్‌డ్ రీయింబర్స్‌మెంట్ ఇస్తారు.
– 250 మంది ఉద్యోగులున్న ఐటీ కంపెనీలకు మొదటి ఐదు యాంకర్ యూనిట్ల ఏర్పాటులో రూ.10 లక్షల సబ్సిడీ ఇవ్వడంతోపాటు ఆయా కంపెనీలు బీపీవో కార్యకలాపాలను ప్రారంభించేందుకు కూడా రాష్ట్ర ప్రభుత్వమే సహకారాన్ని అందజేస్తుంది. దీనిలో భాగంగా రూ.20 లక్షల పెట్టుబడితో ప్రారంభమయ్యే కంపెనీలకు మూల పెట్టుబడిపై 50 శాతం సబ్సిడీ ఇస్తుంది.
– ఇంటర్నెట్, టెలిఫోన్ చార్జీలపై 25 శాతం రీయింబర్స్‌మెంట్ ఇస్తుంది.
– ఐటీ కంపెనీలకు అవసరమైన మానవవనరులను సమకూర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం నాన్-ఐటీ స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్లను ఏర్పాటుచేస్తుంది. ఒక్కో వ్యక్తికి ట్రైనింగ్ సబ్సిడీ కింద మూడునెలల వరకు రూ.2,500 ఇస్తుంది.
– ఐటీ కంపెనీలు ఏర్పాటయ్యే ప్రాంతాల పరిధిలోని కళాశాలలు, శిక్షణ కేంద్రాల్లో టాస్క్ (టీఏఎస్‌కే) కింద ఫ్యాకల్టీ డెవలప్‌మెంట్ కార్యక్రమాలను ప్రభుత్వమే రూపొందిస్తుంది. Source : Namasthe Telangana