రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయ చర్చకు కారణమైన గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ.. ఎట్టకేలకు తన నిర్ణయం ఏంటో తేల్చేసారు. ఇక, టీడీపీలో ఉండనని ఇప్పటికే పార్టీ అధినేత చంద్రబాబుకు స్పష్టం చేస్తూ లేఖ పంపిన వంశీ ఆ లేఖలో ప్రస్తావించిన అంశాలతో ఆయన వైసీపీలోకి మారుతారా లేదా అనే చర్చ మొదలైంది. అదే సమయంలో బీజేపీ నేతలు సైతం వంశీ తమ పార్టీలోకి రావాలంటూ ఆహ్వానించారు. ఇక, టీడీపీ అధినేత చంద్రబాబు ఇద్దరు సీనియర్ నేతలను వంశీతో రాయబారం కోసం నియమించారు. కానీ, వారికి వంశీ అందుబాటులోకి రాలేదు. వంశీ పైన పెట్టిన కేసుల విషయంలోనూ చంద్రబాబు వేధింపుల కోసమే పెట్టారని..వంశీ ఏం తప్పు చేసారని ప్రశ్నించారు. దీంతో..రెండు రోజులుగా హైదారాబాద్ లో ఉన్న వంశీ ఇప్పుడు తన రాజకీయ అడుగుల పైన స్పష్టత ఇచ్చేసారు. తాను టీడీపీ వీడుతున్నట్లుగా తేల్చి చెప్పిన ఆయన..వైసీపీలో చేరుతున్నానని..ముఖ్యమంత్రి సమక్షంలో వైసీపీ కండువా కప్పుకుంటానని తేల్చి చెప్పారు. అందుకు ముహూర్తం సైతం ఫిక్స్ చేసుకున్నారు. నవంబర్ 3 లేదా 4వ తేదీన ఆయన ముఖ్యమంత్రి జగన్ సమక్షంలో వైసీపీలో చేరనున్నారు. ఈ విషయాన్ని స్వయంగా వంశీ తన సన్నిహితులకు స్పష్టం చేసారు. పదవుల కోసం తాను పార్టీ మారటం లేదని.. అనుచరుల కోసమే ఈ నిర్ణయం తీసుకున్నానని వంశీ చెప్పినట్లు సమచారం.
