ఇటీవల జరిగిన మహారాష్ట్ర ఎన్నికల్లో అతిపెద్ద పార్టీగా బీజేపీ అవతరించింది. బీజేఎల్పీ నేతగా మాజీ ముఖ్యమంత్రి ఫడ్నవీస్ ను కూడా ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు ఎన్నుకున్నారు. తమకు ముఖ్యమంత్రి పీఠాన్ని ఇవ్వాలని మొదటి నుండి పట్టుబడుతున్న మిత్రపక్షమైన శివసేనకు డిప్యూటీ సీఎంతో పాటుగా పదమూడు మంత్రి పదవులను కూడా ఆఫర్ చేసింది.ఇలాంటి తరుణంలో బాలీవుడ్ సీనియర్ హీరో అనిల్ కపూర్ ముఖ్యమంత్రి ఏమిటని ఆలోచిస్తున్నారా .. ?.
అయితే ఇది రియల్ గా కాదు రీలో ముఖ్యమంత్రిగా అనిల్ కపూర్ నటిస్తున్నాడు. తమిళ దర్శకుడు ఎస్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన నాయక్ (ఒకే ఒక్కడు మూవీ రీమేక్)లో హీరో అనిల్ కపూర్ మెయిన్ రోల్ గా రాణి ముఖర్జీ ,అమ్రిష్ పురిలు ప్రధాన పాత్రలు పోషించిన సంగతి విదితమే. ఈ మూవీలో హీరో అనిల్ కపూర్ ఒక రోజు ముఖ్యమంత్రిగా ఉండి తన బాధ్యతలను నిర్వహిస్తాడు.
దీనిని ఆధారంగా చేసుకుని నెటిజన్లు హీరో అనిల్ కపూర్ ను మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉండాలని ట్వీటులో కామెంట్లు చేస్తోన్నారు. అక్కడితో ఆగకుండా దేవేంద్ర ఫడ్నవీస్,ఆదిత్య ఠాక్రేలలో ఎవరు ముఖ్యమంత్రిగా ఉంటారో తేల్చేవరకు అయిన అనిల్ కపూర్ ను ముఖ్యమంత్రిగా ఉండమనండి అని ట్వీట్స్ చేస్తున్నారు. దీనికి స్పందించిన అనిల్ కపూర్ “నాయక్ మూవీలో నేను నాయకుడ్ని మాత్రమే “అని ట్విట్టర్ లో రిప్లై ఇచ్చారు. దీనికి నెటిజన్లు సినిమాలో ముందు వద్దు అని ఆ తర్వాత ముఖ్యమంత్రిగా ఉన్నారు కదా.. ఇప్పుడు కూడా అంతే అని రీట్వీటు చేస్తున్నారు.