తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి,అధికార టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఇటీవల హుజూర్ నగర్ నియోజకవర్గ కృతజ్ఞత సభలో పలు హామీలను కురిపించిన సంగతి విదితమే. అందులో భాగంగా హుజూర్ నగర్ ను రెవిన్యూ డివిజన్ గా చేస్తానని ఆయన హామీచ్చారు.
హామీచ్చిన విధంగానే హుజూర్ నగర్ ను రెవిన్యూ డివిజన్ గా ఏర్పాటు చేస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రాథమిక నోటిఫికేషన్ ను జారీచేసింది. ఉమ్మడి జిల్లాలోని సూర్యాపేట రెవిన్యూ డివిజన్లోని మూడు,కోదాడ రెవిన్యూ డివిజన్లోని నాలుగు మండలాలను కల్పి హుజూర్ నగర్ రెవిన్యూ డివిజన్లుగా ఏర్పాటు చేయనున్నారు.
హుజూర్ నగర్ నియోజకవర్గ పరిధిలోని హుజూర్ నగర్,మఠంపల్లి,మేళ్ల చెరువు,చింతలపాలెం(మల్లారెడ్డి గూడెం),గరిడేపల్లి,పాలకవీడు,నేరేడుచర్ల మండలాలు ఈ రెవిన్యూ డివిజన్ పరిధిలోకి రానున్నాయి. అయితే తాజా రెవిన్యూ డివిజన్ పై అభ్యంతరాలు,సూచనలు,సలహాలు స్వీకరణకు ముప్పై రోజుల పాటు గడవు ఇచ్చినట్లు రెవిన్యూ శాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి సోమేశ్ కుమార్ నిన్న మంగళవారం ఉత్తర్వులు ఇచ్చారు.