అక్టోబర్ 31 న అంటే రేపు విశాఖ శ్రీ శారదాపీఠాధిపతులు శ్రీ శ్రీ శ్రీ స్వరూపానందేంద్ర సరస్వతి మహాస్వామివారి జన్మదినోత్సవ వేడుకలు విశాఖపట్టణం చినముషిడివాడలోని విశాఖ శ్రీ శారదాపీఠంలో అంగరంగవైభవంగా జరుగనున్నాయి. రేపు స్వామివారి జన్మదినోత్సవ వేడుకల్లో పాల్గొనేందుకు దేశం నలుమూలల నుంచి రాజకీయ, సినీ ప్రముఖులు, భక్తులు పెద్ద సంఖ్యలో తరలిరానున్నారు. రేపటి స్వామివారి జన్మదినోత్సవ వేడుకల్లో స్వయంగా ఏపీ గవర్నర్ బిశ్వభూషన్ హరిచందన్ పాల్గొననున్నారు. ఈ మేరకు ఏపీ రాజభవన్ గవర్నర్ టూర్ షెడ్యూల్‌ను ఖరారు చేసింది. రేపు ఉదయం విజయనగరం జిల్లాలో పలు అధికారిక కార్యక్రమాల్లో గవర్నర్ పాల్గొంటారు. తదనతరం మధ్యాహ్నం 2.55 గంటలకు సాలూరు నుంచి విశాఖకు బయలుదేరి, మూడున్నరకు విశాఖ ఎయిర్‌పోర్ట్ చేరుకుంటారు. మూడు గంటల 50 నిమిషాలకు చినముషిడివాడలోని విశాఖ శ్రీ శారదాపీఠానికి గవర్పర్ చేరుకుంటారు. శ్రీ స్వరూపానందేంద్ర సరస్వతి స్వామివారి జన్మదినోత్సవ వేడుకల్లో గవర్నర్ పాల్గొంటారు. సాయంత్రం 4 గంటల 10 నిమిషాలకు గవర్నర్ విశాఖ శ్రీ శారదాపీఠం నుంచి బయలుదేరి 4.30 ని.లకు విశాఖలోని సర్కూట్ హౌస్‌కు చేరుకుంటారు. రేపు గవర్నర్ రాక సందర్భంగా విశాఖ శ్రీ శారదాపీఠం వద్ద పోలీసులు గట్టి బందోబస్త్ ఏర్పాట్లు చేస్తున్నారు. రేపు శ్రీ స్వరూపానందేంద్ర సరస్వతి మహాస్వామివారి జన్మదినోత్సవం సందర్భంగా విశాఖ నగరమంతటా శుభాకాంక్షలు తెలుపుతూ భక్తులు పెద్ద ఎత్తున హోర్డింగ్‌లు, ఫ్లెక్సీలు, స్వాగత తోరణాలు ఏర్పాటు చేశారు. స్వామివారి జన్మదినోత్సవ వేడుకలకు భక్తులు వేలాదిగా తరలిరానున్నారు. మొత్తంగా స్వామివారి జన్మదినోత్సవ వేడుకల సందర్భంగా విశాఖ నగరంలో ఆధ్యాత్మిక శోభ నెలకొంది.
