గన్నవరం టీడీపీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్ దీపావళి రోజు పార్టీకి, తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశాడు. పైకి వైసీపీ నేతల వత్తిడులు, అధికారుల వేధింపులు అని చెప్పినా..అంతర్గతంగా పార్టీలోనే కనిపించని శత్రువులతో పోరాడలేకే రాజకీయాల నుంచి తప్పుకున్నట్లు వంశీ చెప్పుకొచ్చాడు. అయితే చంద్రబాబు మాత్రం వల్లభనేని వంశీని బుజ్జగించడానికి ఎంపీ కేశినేని నాని తదితరులను రంగంలోకి దింపారు. కాని వంశీ మాత్రం తన రాజీనామాపై వెనక్కి తగ్గే సూచనలు కనిపించడం లేదు..దీంతో వంశీపై ఆశలు వదిలేసుకున్న చంద్రబాబు ప్లాన్ బి రెడీ చేశాడు. గన్నవరంలో ఉప ఎన్నికలు వస్తే టీడీపీ అభ్యర్థిగా విజయవాడ ఈస్ట్ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు సతీమణి , కృష్ణా జిల్లా పరిషత్ మాజీ చైర్ పర్సన్ గద్దె అనురాధను పోటీ చేయించేందుకు చంద్రబాబు రంగం సిద్ధం చేశాడు. 2019 సార్వత్రిక ఎన్నికల్లో జిల్లాలో జగన్ ప్రభంజనాన్ని తట్టుకొని మరీ, వ్యక్తిగత ఛరిష్మాతో గెలిచిన టీడీపీ ఎమ్మెల్యేలు వంశీ, గద్దె రామ్మోహన్ రావులు మాత్రమే. గద్దె రామ్మోహన్‌రావుకు ఉన్న మంచి ఇమేజ్, ఫాలోయింగ్ దృష్ట్యా ఆయన సతీమణి అనురాధను అభ్యర్థిగా ప్రకటిస్తే..ఈజీగా గెలవచ్చని బాబు భావిస్తున్నాడు. అయితే వైసీపీ అభ్యర్థిగా యార్లగడ్డ వెంకట్రావు బరిలో దిగే అవకాశాలు మెండుగా ఉన్నాయి. 5 నెలల క్రితం జరిగిన ఎన్నికల్లో వంశీపై కేవలం 700 పై చిలుకు ఓట్ల తేడాతోనే యార్లగడ్డ ఓడిపోయారు. గత ఎన్నికల్లో ఓడిపోయాడనే సింపతీ ఆయనపై కచ్చితంగా ఉంటుంది. మరోవైపు జగన్ సర్కార్ అమలు చేస్తున్న పలు ప్రజా సంక్షేమ కార్యక్రమాల పట్ల ప్రజల్లో సానుకూలత ఏర్పడింది. రాజధాని విషయంపై టీడీపీ ఎంత బురద జల్లుతున్నా..ఉప ఎన్నికల్లో స్థానిక అంశాలే ప్రభావితం చూపే అవకాశం ఉంది. సహజంగానే ఉప ఎన్నికల్లో అధికార పార్టీకి కాస్త ఫేవర్‌గానే ఉంటుంది. గన్నవరం డెవలప్‌మెంట్ కోసం ప్రజలు అధికార పార్టీ అభ్యర్థి వైపు మొగ్గుచూపే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఈ నేపథ‌్యంలో గద్దె రామ్మోహన్ లాంటి బలమైన నాయకుడి సతీమణిని బరిలో దింపితే గన్నవరం సీటును నిలబెట్టుకోవచ్చని..చంద్రబాబు ప్లాన్..మొత్తంగా గన్నవరంలో వంశీ రాజీనామాకు ఆమోద ముద్ర పడితే..త్వరలోనే ఉప ఎన్నికల నగారా మోగడం ఖాయంగా కనిపిస్తుంది.
మరి చంద్రబాబు ప్లాన్ బివర్కవుట్ అవుతుందా..గన్నవరం స్థానాన్ని టీడీపీ నిలబెట్టుకుంటుందా..లేకా వైసీపీ చేజిక్కించుకుంటుందా అన్నది తెలియాలంటే మరి కొద్ది రోజులు ఆగాల్సిందే.