కర్నూల్ జిల్లా దొర్నిపాడు జడ్పీ ఉన్నత పాఠశాలలో పదో తరగతి చదువుతున్న హాజ్‌మున్నీ(15) అనే విద్యార్థిని శుక్రవారం గుండెజబ్బుతో కన్నుమూసింది. ఆమె మృతితో పాఠశాలలో విషాదం నిండింది. మృతికి సంతాపంగా మధ్యాహ్నం నుంచి పాఠశాలకు సెలవు ప్రకటించారు. అందరితో కలిసిమెలిసి ఉండే ఈమె మృతిని స్నేహితురాళ్లు జీర్ణించుకోలేక పోయారు. పాఠశాలలోనే బోరున విలపించారు. గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి.
చదువు, క్రీడల్లో రాణింపు: హాజ్‌మున్నీని గుండెజబ్బు వెంటాడినా ఆత్మస్థైర్యంతో ముందుకు సాగింది. ఈమె చదువులో మొదటి స్థానాల్లో నిలిచేది. అటు చదువుతోపాటు ఖోఖో, త్రోబాల్ క్రీడల్లోనూ రాణించి జిల్లా స్థాయి పోటీలకు ఎంపికైంది. చదువు, క్రీడల్లో రాణించింది. చిన్నతనం నుంచే గుండె సమస్యతో బాధపడుతున్నా ఆత్మస్థైర్యంతో ముందుకు సాగేది. రెండు రోజులుగా అనారోగ్య సమస్యతో బాధపడుతూ ఇంటి పట్టునే ఉండి చికిత్స పొందింది. శుక్రవారం మధ్యాహ్నం అకస్మాత్తుగా గుండెనొప్పితో విలవిల్లాడి పోయింది. వెంటనే ఆటోలో ఆమెను ఆళ్లగడ్డకు తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందింది. కుమార్తె మృతితో తల్లిదండ్రులు హాజీవలి, మహబూబ్‌బీలను ఓదార్చడం ఎవరితరం కాలేదు. కూతురిని కాపాడుకునేందుకు, ఆరోగ్యం మెరుగు పరిచేందుకు వీరు పలుచోట్ల తిరుగుతూ వైద్యుల వద్ద చికిత్స అందించేవారు. గుండెలో అరుదైన సమస్య ఉండటంతో శస్త్రచికిత్స చేసేందుకు అడ్డంకులు ఏర్పడినా గాజు బొమ్మలా చూసుకుంటూ ఆమెను కాపాడుకునేందుకు తల్లిదండ్రులు ఎంతో శ్రద్ధ వహించారు. అయినా ఫలితం లేకపోడంతో అందరినీ విడిచి మృత్యుఒడికి చేరుకుంది.