కడప జిల్లాలో జమ్మలమడుగు మాజీ ఎమ్మెల్యేకు ఆదినారాయణరెడ్డికి ఆసుపత్రి మందుల కంటే మాన్షన్ హౌస్ మాత్రమే తెలుసంటూ వైసీపీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. వైసీపీ తరపున గెలిచి, అధికారం కోసం చంద్రబాబు ఆపరేషన్ ఆకర్ష్‌లో భాగంగా టీడీపీలోకి ఫిరాయించిన ఆదినారాయణరెడ్డి ఏకంగా మంత్రి పదవే వెలగబెట్టాడు. అయితే చంద్రబాబు మాత్రం జమ్మలమడుగు టికెట్ ఆదికి ఇవ్వకుండా హ్యాండ్ ఇచ్చాడు. జిల్లాలో గెలవడం కష్టసాధ్యమైన కడప ఎంపీ టికెట్ ఇచ్చాడు. అయిష్టంగానే కడప ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసిన ఆదినారాయణరెడ్డి వైసీపీ అభ్యర్థి వైయస్ అవినాష్ రెడ్డి చేతిలో ఘోర పరాజయం పాలయ్యాడు. ఓటమి అనంతరం టీడీపీలో అయిష్టంగానే కొనసాగిన ఆదినారాయణరెడ్డి కొద్ది రోజుల క్రితం టీడీపీకి గుడ్‌బై చెప్పి, బీజేపీలో చేరాడు. గత కొద్ది రోజులుగా వైసీపీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ఉద్యోగాలు అమ్ముకుంటున్నట్లు ఆది తీవ్ర విమర్శలు చేస్తున్నాడు. తాజాగా ఆది ఆరోపణలకు స్పందించిన వైసీపీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ఆదిపై తనదైన స్టైల్లో సెటైర్లు వేశాడు. బెంగళూరులో క్లబ్బులకు సెలవు కావడంతో చుట్టపుచూపుగా జమ్మలమడుగుకు వచ్చిన ఆదినారాయణరెడ్డి తనపై విమర్శలు చేయడం ఏ మాత్రం సరికాదన్నారు. ఆదినారాయణరెడ్డి తోడబుట్టిన అన్నదమ్ములే ఆయన నిజస్వరూపం తెలుసుకుని దూరంగా ఉంచారని సుధీర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఆయనకు ఆసుపత్రిలో రోగులకు ఇచ్చే మందుల గురించి తెలియదు కాని, ప్రతి రోజు తీసుకునే మాన్షన్‌హౌస్ మాత్రం తెలుసని ఎద్దేవా చేశారు. తనపై ఆది చేసిన విమర్శలకు స్పందిస్తూ..తాను ఉద్యోగాలు అమ్ముకున్నానని చేస్తున్న ఆరోపణలను నిరూపిస్తే..తక్షణమే రాజీనామా చేస్తానని, దమ్ముంటే నిరూపించాలని సుధీర్ రెడ్డి సవాలు చేశారు. అంతేకాదు ఇప్పటికే వైసీపీ నుంచి టీడీపీకీ, టీడీపీ నుంచి బీజేపీకి మారిన ఆదినారాయణరెడ్డికి ఇక మిగిలింది..జనసేనే అని వైసీపీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి వెటకారం ఆడారు. మొత్తంగా ఆదినారాయణరెడ్డికి మాన్షన్ హౌస్ మాత్రమే తెలుసంటూ..వైసీపీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి వేసిన సెటైర్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
