ఏపీ మాజీ స్పీకర్, టీడీసీ సీనియర్ నేత కోడెల శివప్రసాద్ రావు ఆత్మహత్య తెలుగు రాజకీయాలను కుదిపేసింది. వరుసగా కేసుల్లో ఇరుక్కుపోవడం, పార్టీలో ఎదురవుతున్న అవమానాలు, చంద్రబాబు, లోకేష్‌లు పూర్తిగా తనను పక్కన పెట్టేయడం, కుటుంబ కలహాలు, అనారోగ్య సమస్యలు..వెరసి కోడెల వంటి సీనియర్ నేత ఆత్మహత్యకు దారితీశాయని నరసరావుపేట, సత్తెనపల్లిలో ఆయన అభిమానులు అంటున్నారు.. కోడెల ఆత్మహత్య ముమ్మూటికి ప్రభుత్వ హత్యే అంటూ చంద్రబాబు నాలుగు రోజుల పాటు వైసీపీ ప్రభుత్వంపై దుమ్మెత్తిపోశాడు. అయితే ప్రభుత్వం మాత్రం కోడెల వంటి సీనియర్ నేతను గౌరవప్రదంగా సాగనంపడానికి ముందుకు వస్తే..చంద్రబాబు పార్టీ కార్యకర్తలను రెచ్చగొట్టి అధికార లాంఛనాలు జరుగకుండా అడ్డుకున్నాడు. ఇప్పటికీ కోడెల ఆత్మహత్యకు ఇతిమిద్ధంగా కారణాలు తెలియడంలేదు..అయితే తాజాగా కోడెల ఆత్మహత్యపై కాంగ్రెస్ మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. టీడీపీ వ్యవస్థాపక సభ్యుడిగా, ఎన్టీఆర్ కాలం నుంచి పార్టీలో తిరుగులేని లీడర్‌గా ఎదిగిన కోడెల ఇలా ఆత్మహత్య చేసుకోవడం బాధాకరం అని ఉండవల్లి అన్నారు. కోడెల శివప్రసాద్ గారు ఎందుకు సూసైడ్ చేసుకున్నారో..ఇప్పటికీ ఎవరికి తెలియదు. కాని కోడెల గత చరిత్ర చూస్తే ఆయన దమ్మున్న నేత..శత్రువుకు భయపడి ఆత్మహత్య చేసుకునే పిరికి మనస్తత్వం కోడెలకు లేదని ఉండవల్లి చెప్పుకొచ్చారు.
కోడెల అగ్రెస్సివ్ పొలిటీషియన్…ఒకప్పుడు ఆయన ఇంట్లో బాంబులు పేలిన ఘటనలు ఉన్నాయని, ఎన్టీఆర్‌ను సీఎం పదవి నుంచి దించేస్తే తన అనుచరులతో కలిసి, పోలీస్ స్టేషన్‌పై దాడి చేసిన డేరింగ్ అండ్ డాషింగ్ లీడర్ కోడెల అని ఉండవల్లి అన్నారు. కోడెల మంచి రాజకీయ నేత మాత్రమే కాదు..మంచి పేరున్న డాక్టర్..సర్జన్‌గా వందలాది మందికి క్లిష్టమైన ఆపరేషన్లు చేసి, ప్రాణాలు నిలబెట్టిన కోడెల చివరకు తన ప్రాణాలు తీసుకునేంత వ్యక్తి కాదన్నారు. బలమైన వ్యక్తిత్వం కలిగిన టీడీపీ నేతల్లో కోడెల ముందు వరుసలో ఉంటారని ఆయన శత్రువును ఎదుర్కొంటారు కాని..శత్రువుకి భయపడి ఆత్మహత్య చేసుకోరు అని ఉండవల్లి స్పష్టం చేశారు. కోడెల ఆత్మహత్య వెనుక ఏదో బలమైన కారణం ఉండి ఉంటుందని ఆయన అన్నారు. కోడెల తన దగ్గరి వారి నుంచే అవమానాలు ఎదుర్కుని ఉంటారని, తన వారు అనుకున్నవారే ఇబ్బందుల్లోకి నెట్టేయడంతో ఆయన ఆత్మహత్యకు పాల్పడ్డారేమో అని ఉండవల్లి అనుమానం వ్యక్తం చేశారు. మొత్తంగా కోడెల తనను నమ్మినవాడే ఇబ్బందుల్లోకి నెట్టేయడంతో ఆత్మహత్యకు పాల్పడ్డి ఉంటారని ఉండవల్లి సంచలన వ్యాఖ్యలు చేశారు. కోడెలను చివరి రోజుల్లో చంద్రబాబు కనీసం అపాయింట్‌మెంట్ కూడా ఇవ్వలేదు. పైగా గుంటూరులో ఛలో ఆత్మకూరు ప్రోగ్రామ్‌కు పిలుపునిచ్చి..కనీసం సీనియర్ నేత అయిన కోడెలకు సమాచారం కూడా ఇవ్వలేదు. పైగా నరసరావుపేట, సత్తెనపల్లిలో కోడెలకు వ్యతిరేక వర్గాలను చంద్రబాబు ప్రోత్సహించాడు. ముఖ్యంగా అసెంబ్లీ ఫర్నీచర్ తరలింపు విషయంలో వర్లరామయ్య, సత్తెనపల్లి టీడీపీ నేతలతో కోడెలను తప్పుపట్టించాడు. అంతే కాదు మీ కుమారుడు, కూతురు అవినీతి వల్ల పార్టీకి చెడ్డపేరు వస్తుంది.. మీతో సహా, మీకుటుంబాన్ని సస్పెండ్ చేయమంటున్నారంటూ చంద్రబాబు కోడెలతో డైరెక్ట్‌గా చెప్పినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో తీవ్ర మనస్తాపానికి గురైన కోడెల ఆత్మహత్యకు పాల్పడినట్లు నరసరావుపేటలో చర్చ జరుగుతోంది. మొత్తంగా కోడెల తనపై వచ్చిన కేసులకంటే..తాను నమ్మినవాడే ఇబ్బందుల్లోకి నెట్టేయడంతో ఆత్మహత్యకు పాల్పడిఉంటారని ఉండవల్లి చేసిన వ్యాఖ్యలు ఏపీ రాజకీయాల్లో సంచలనంగా మారాయి.