అక్టోబర్ 26, శనివారంనాడు సాక్షి పత్రికలో చెప్పుకోలేని బాధ శీర్షికతో ఓ కథనం వచ్చింది. ఆ కథనం చదివి టీఆర్ఎస్ ఎంపీ సంతోష్‌కుమార్ చలించిపోయారు. వెంటనే బాలికలకు బాసటగా నిలిచేందుకు ముందుకు వచ్చారు. పూర్తి వివరాల్లోకి వెళితే.. మహబూబ్‌బాద్ జిల్లా, గూడూరు జెడ్పీ ఉన్నత పాఠశాలలో దాదాపు 130 మంది విద్యార్థినులు చదువుకుంటున్నారు. అలాగే ఈ భవనంలోనే ప్రాథమిక పాఠశాల కూడా ఉంది. అందులో 80 మంది విద్యార్థినులు చదువుతున్నారు. వీరితోపాటు టీచర్లకు కలిపి స్కూల్లో ఒకే ఒక టాయిలెట్ ఉంది. దీంతో టాయిలెట్‌కు వెళ్లాలంటే బాలికలు, టీచర్లు క్యూ కట్టాల్సిన దుస్థితి ఏర్పడింది. తాజాగా సాక్షి బాలికలు పడుతున్న ఇక్కట్లపై చెప్పుకోలేని బాధ శీర్షికన ఓ కథనం ప్రచురించింది. కథనంతో పాటు టాయిలెట్ కోసం క్యూ లైన్లో బారులు దీరిన బాలికల ఫోటోను పబ్లిష్ చేసింది. ఈ కథనంపై టీఆర్ఎస్ ఎంపీ సంతోష్‌కుమార్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. విద్యార్థినులు టాయిలెట్ కోసం చాంతాడంత క్యూలైన్ పాటించాల్సిన దుస్థితి పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేశారు. తక్షణ చర్యల్లో భాగంగా వెంటనే తన ఎంపీ నిధుల నుంచి గూడూరు పాఠశాలలో మరుగుదొడ్ల నిర్మాణాలకు నిధులు కేటాయిస్తానని ఎంపీ సంతోష్‌కుమార్ ట్వీట్ చేశారు. ఈ మేరకు ట్విట్టర్‌లో సాక్షి కథనాన్ని పోస్ట్ చేశారు. టాయిలెట్ల నిర్మాణానికి తాను బాధ్యత తీసుకుని పూర్తి చేయిస్తానని, ఈ మేరకు అధికారులకు సూచనలు చేస్తున్నట్లు ఎంపీ సంతోష్‌కుమార్ తెలిపారు. సాక్షి కథనానికి ఏపీ రాష్ట్రం మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్లరామకృష్ణారెడ్డి కూడా స్పందించారు. గూడూరు పాఠశాలలో టాయిలెట్ల నిర్మాణం కోసం రూ.1.75లక్షల ఆర్థిక సాయాన్ని ఆళ్ల ప్రకటించారు. కాగా గూడూరు పాఠశాలలోని టాయిలెట్ల సమస్యపై స్పందించిన తెలంగాణ విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి మహబూబాబాద్ జిల్లా కలెక్టర్‌తో ఫోనులో మాట్లాడారు. వెంటనే పాఠశాలలో అదనంగా మరికొన్ని మరుగుదొడ్లు నిర్మించి అందుబాటులోకి తేవాలని ఆదేశించారు. జిల్లాలోని అన్ని పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యకు తగ్గా మరుగుదొడ్లను నిర్మించాలని, ఈమేరకు నిధులు విడుదల చేయనున్నట్లు మంత్రి పేర్కొన్నారు. మొత్తంగా బాలికల చెప్పుకోలేని బాధను వెలుగులోకి తీసుకువచ్చిన సాక్షి పత్రికపై సర్వత్రా ప్రశంసలు కురుస్తున్నాయి. బాధ్యతాయుతమైన మీడియాగా, ప్రతి క్షణం ప్రజల పక్షాన ఉంటామని సాక్షి మరోసారి రుజువు చేసింది.
Tags guduru girls high scholl helping mahabubabad district Mp Santosh Kumar react telangana toilet probelm Twitter