గన్నవరం టీడీపీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ రాజీనామా వ్యవహారం ఏపీ రాజకీయాలను హీటెక్కిస్తోంది. దీపావళి రోజున టీడీపీకి , తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. ఈ మేరకు స్వయంగా వంశీ అధినేత చంద్రబాబుకు ఓ లేఖ రాశారు. అయితే వైసీసీ నేతల కక్ష సాధింపు, అధికారుల వేధింపుల వల్లనే పార్టీకి, పదవికి రాజీనామా చేస్తున్నట్లు వంశీ చెప్పినా..పరోక్షంగా ఆ లేఖలో చంద్రబాబుపై కూడా సుతిమెత్తగా విమర్శలు చేశాడు. పార్టీలోనే కనిపించని శత్రువులతో పోరాడలేక పార్టీని వీడుతున్నట్లు వంశీ చెప్పుకొచ్చాడు. దీంతో పార్టీలో వంశీకి కనిపించని శత్రువులు ఎవరనే విషయంపై టీడీపీలో చర్చ జరుగుతోంది. బాబుకు లేఖలో 2009లో విజయవాడ ఎంపీగా పోటీ చేసి, ఓడిపోయిన విషయాన్ని కూడా వంశీ ప్రస్తావించారు. అప్పట్లో గన్నవరం ఎమ్మెల్యే టికెట్ అడిగినా చంద్రబాబు వినిపించుకోలేదని, కాని విజయవాడ ఎంపీగా పోటీ చేయడంతో ఓటమి పాలయ్యానని, అంతే కాదు తన గెలుపు కోసం జిల్లా టీడీపీ కూడా సహకరించలేదని వంశీ కుండబద్ధలు కొట్టారు. మాస్ లీడర్‌గా ఎదిగిన వంశీ బాబు సామాజికవర్గమే అయినా..పార్టీలో పెద్దగా ప్రాధాన్యత దక్కలేదు. కాగా వంశీ జూనియర్ ఎన్టీఆర్‌కు అత్యంత సన్నిహితుడు..అందుకే చంద్రబాబు వంశీని పక్కనపెట్టినట్లు పార్టీలో టాక్. అంతే కాదు జిల్లాలో మాస్ లీడర్ అయిన వంశీని పక్కనపెట్టి..తన సామాజికవర్గానికే చెందిన దేవినేని ఉమను చంద్రబాబు బాగా ఎంకరేజ్ చేసేవాడు. జిల్లాలో ప్రభుత్వ కార్యక్రమాల్లో కాని, పార్టీ కార్యక్రమాల్లోకాని బాబు ఉమాకే ప్రాధాన్యత ఇచ్చాడు. గత ఐదేళ్లలో అధికార పార్టీలో ఉన్నా గన్నవరం నియోజకవర్గంలో అభివృద్ది పనులు జరుగకుండా దేవినేని ఉమా తొక్కిపెట్టాడన్న విమర్శలు ఉన్నాయి. అధికార పార్టీలో ఉన్నా అధికారులతో వంశీ బాగా ఇబ్బందులు ఎదుర్కున్నాడు. ఇదిలా ఉంటే 2019 సార్వత్రిక ఎన్నికల్లో కృష్ణా జిల్లాలో టీడీపీ చావు దెబ్బ తింది. బాబుగారికి అత్యంత సన్నిహితుడైన దేవినేని ఉమా కూడా ఓడిపోయాడు. వంశీ మాత్రం మళ్లీ గెలిచాడు. కాని ఓడిపోయిన తర్వాత కూడా చంద్రబాబు తనకంటే దేవినేని ఉమకే ప్రాధాన్యత ఇవ్వడం వంశీ జీర్ణించుకోలేకపోయాడు. ఒక పక్క ఫోర్జరీ కేసులు, మరోవైపు పార్టీలో నిరాదరణ, వర్గ విబేధాలు చివరకు వంశీ రాజీనామాకు దారితీశాయి. మొత్తంగా పైకి వైసీపీ నేతలు, అధికారుల వేధింపులు అని చెబుతున్నా…అంతర్గతంగా మాత్రం బాబు నిరాదరణ, దేవినేని ఉమల ఆధిపత్యధోరణి వంశీని పార్టీని వీడేలా చేశాయి. అందుకే పార్టీలో కనిపించని శత్రువులతో పోరాడలేక రాజీనామా చేస్తున్నట్లు బాబుకు రాసిన లేఖలో పేర్కొన్నాడు. మరి ఆ కనిపించని శత్రువులు ఎవరో ఈపాటికి మీకు అర్థమై ఉంటుంది.