ఆర్టీసీ సమ్మెపై ఇవాళ హైకోర్ట్‌లో విచారణ జరిగింది. ఆర్టీసీ సమ్మెపై కార్మిక సంఘాలతో జరిగిన చర్చల వివరాలను అడ్వకేట్ జనరల్ హైకోర్ట్‌కు తెలిపారు. కోర్ట్ ఇదివరకు ఇచ్చిన ఆదేశాల మేరకు విలీనం మినహా మిగతా 21 డిమాండ్లపై చర్చ జరుపుదామన్న ఆర్టీసీ ఉన్నతాధికారుల మాటలను కార్మిక సంఘాలు లెక్క చేయడం లేదని అడ్వకేట్ జనరల్ కోర్టుకు తెలిపారు. విలీనంతో సహా అన్ని డిమాండ్లకు చర్చ జరపాలని పట్టుబట్టి..చివరకు చర్చలు జరుగకుండానే కార్మిక సంఘాలు బయటకు వెళ్లిపోయారని కోర్ట్‌కు తెలియజేశారు. దీంతో ఓవర్‌నైట్ విలీనం ఎలా సాధ్యమవుతుందని కార్మిక సంఘాలను హైకోర్ట్ ప్రశ్నించింది. ఆర్టీసీ కార్మికులు ఇచ్చిన మొత్తం డిమాండ్లలో కార్పొరేషన్‌కు ఆర్థిక భారం కాని డిమాండ్లపై మాత్రమే జరపాలని హైకోర్ట్ కార్మికసంఘాలకు సూచిస్తూ విచారణను రేపటికి వాయిదా వేసింది. ఈలోపు సమ్మెకు సంబంధించిన వివరాలు కోర్టుకు సమర్పించాలని, . ఆర్టీసీకి రావాల్సిన పూర్తి బకాయిల వివరాలు కోర్టుకు ఇవ్వాలని ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది.