ఆర్థిక మంత్రి హరీశ్ రావు నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటారన్న విషయం తెలిసిందే. మంత్రిగా రాజధానిలో ఉండాల్సి వచ్చినా.. ఆయన దృష్టంతా తన నియోజకవర్గ ప్రజలపైనే ఉంటుంది. అయితే ఆయనను కలవడానికి భారీగా ఖర్చు పెట్టుకుని హైదరాబాద్‌కు వచ్చే వాళ్ల సంఖ్య పెద్దమొత్తంలోనే ఉంటుంది. ఈ విషయంలో హరీశ్ కాస్త ఆందోళన చెందుతుంటారు. డబ్బు ఖర్చుపెట్టుకుని తనను కలవడానికి రావొద్దని.. ఆదివారం తనను కలిసిన వారికి సూచించారు హరీశ్.
ఏదైనా సమస్య ఉంటే సిద్దిపేటలోనే తనను కలవాలని.. వారంలో నాలుగు రోజులు అక్కడే ఉంటానని భరోసా ఇచ్చారు. ఆపద ఉన్నా.. ఆస్పత్రి పని ఉంటే మాత్రమే హైదరాబాద్‌కు రావాలని చెప్పుకొచ్చారు.‘‘ఈ రోజు ఇక్కడే ఉన్నా… రేపు అక్కడే ఉంటాను. సిద్దిపేట ప్రజలు ఇక్కడికి వస్తున్నారు అంటే.. నేనే ఎక్కడో మీకు సేవ చేయలేకపోతున్నానని అర్థం. ఎక్కడో ఫెయిల్ అయినట్టే కదా. మబ్బులో ఐదు గంటలకు లేచుంటారు. ఐదువేల రూపాయలతో బండి మాట్లాడుకుని.. టిఫిన్ ఖర్చులు పెట్టుకుని వస్తారు. మీరొచ్చే పనుల్లో రూపాయికి 90 పైసలు కానివి ఉంటాయి. దీంతో రానుపోను పనులు ఖరాబైపోయినట్టే కదా. అంతదూరం వచ్చి.. పనికాకపోతే.. మనసు నొచ్చుకుంటుంది. మీ మనసు నొచ్చుకుంటే.. నా మనసు నొచ్చుకున్నట్టే’’ అంటూ వారికి వివరించారు. దీనికి సంబంధించిన వీడియోను టీఆర్ఎస్ పార్టీ మెదక్ ట్విట్టర్‌లో పోస్టు చేశారు. దీనిపై నెటిజన్లు పెద్దఎత్తున స్పందిస్తున్నారు. నాయకుడు అంటే ఇలాగే ఉండాలంటూ ట్వీట్ చేస్తున్నారు.