సీఎం కేసీఆర్ పై త్రిదండి చినజీయర్ స్వామి ప్రశంసల వర్షం కురిపించారు. రాష్ట్రంలోని రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం ముచ్చింతల్ లోని త్రిదండి చినజీయర్ స్వామి ఆశ్రమం తిరునక్షత్రోత్సవ వేడుకలతో పరవశించిపోయింది. సీఎం కేసీఆర్ దంపతులు ఈ వేడుకలకు హాజరయ్యారు. చినజీయర్ స్వామి వారికి ఫలపుష్పాలు సమర్పించి మంగళాశాసనాలు అందుకున్నారు. ఈ సందర్భంగా చినజీయర్ స్వామి సత్యసంకల్ప గ్రంథాన్ని ముఖ్యమంత్రికి బహుకరించారు. ఈ సందర్భంగా త్రిదండి చినజీయర్ స్వామి మాట్లాడుతూ.. అధికారంలో ఉన్న ముఖ్యమంత్రులు దైవభక్తిని బయటకు చాటుకోవడానికి భయపడుతుంటారని… సీఎం కేసీఆర్ అలాంటి వారు కాదని స్పష్టం చేశారు. యాదాద్రి పుణ్యక్షేత్రాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ మహాద్భుతంగా నిర్మిస్తున్నారని చినజీయర్ స్వామి కీర్తించారు. భగవంతుడిని పూజించే సంస్కారం తమ తల్లిదండ్రుల పరంపర నుంచి వచ్చిందన్నారు సీఎం కేసీఆర్. దేవాలయం అంటే భగవంతుడిని ఆరాధించే కమ్యూనిటీ హాల్ అని చెప్పారు. సిద్ధిపేట మొదటి ఎమ్మెల్యే గురువారెడ్డి కమ్యూనిస్టు అయినప్పటికీ.. రామాలయం నిర్మించారని కొనియాడారని గుర్తు చేశారు. హైందవ సంప్రదాయంలో ఉండే శక్తి చాలామందికి తెలియదన్న ముఖ్యమంత్రి… హిందూ సంప్రదాయాన్ని కాపాడేందుకు జీయర్ స్వామిలాంటి వారు ఉన్నారని ప్రశంసించారు. యాదాద్రి ప్రధాన ఆలయం ప్రారంభోత్సవం సందర్భంగా 1,008 కుండలాలతో మహాసుదర్శన యాగం నిర్వహిస్తామన్నారు సీఎం కేసీఆర్. యాగంకోసం ప్రపంచంలోని వైష్ణవ పీఠాలను ఆహ్వానిస్తామన్నారు. సుదర్శన యాగంతో పాటు యాదాద్రిలో రామానుజ స్వామివారి విగ్రహావిష్కరణ ఉంటుందన్నారు సీఎం కేసీఆర్. తిరునక్షత్రోత్సవ వేడుకల సందర్భంగా ముచ్చింతల్ దైవనామస్మరణతో హోరెత్తింది. వేడుకలకు హాజరైన వారంతా చినజీయర్ స్వామి ఆశీస్సులు అందుకున్నారు. అందరు సుఖ, శాంతులతో ఉండాలని ప్రార్థించారు.
