హుజూర్‌నగర్ నియోజకవర్గ అభివృద్ధికి తన శాయశక్తులా కృషిచేస్తానని సీఎం కేసీఆర్ ముందు, మీ అందరి ముందు ప్రమాణం చేస్తున్నానని హుజూర్‌నగర్ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి అన్నారు. హుజూర్‌నగర్ ప్రజా కృతజ్ఞత సభలో పాల్గొన్న ఎమ్మెల్యే సైదిరెడ్డి ఈ సందర్భంగా మాట్లాడుతూ.. సభకు విచ్చేసిన అమ్మలకు, అక్కలకు, చెల్లెళ్లలకు, అన్నలకు, తమ్ముళ్లకు, మావలకు, అత్తలకు, బావలకు, స్నేహితులకు పేరుపేరున ప్రతీఒక్కరికి వందనాలు, పాదాభివందనం తెలియజేస్తున్నా. నన్ను, మిమ్మల్ని నమ్మి టీఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థిగా ఒకసారి ఓడిపోయినా మళ్లా రెండోసారి అభ్యర్థిగా ప్రకటించి ఈ రోజు ఎమ్మెల్యేను చేసిన మన ప్రియతమ ముఖ్యమంత్రి కేసీఆర్‌గారికి పాదాభివందనం. ఒకే ఒక్క సభతో మొత్తం కార్యకర్తలందరినీ సమరోత్సాహులను చేసి ఉద్యమం వైపు నడిపించి హుజూర్‌నగర్ ఎమ్మెల్యే సీటును కైవసం చేసుకోవటానికి దగ్గరుండి నడిపించిన మన కార్యనిర్వాహక అధ్యక్షులు కేటీఆర్‌గారికి, నిరంతరం పక్కనే ఉండి నన్ను నడిపించిన నియోజకవర్గ ఇంచార్జి పల్లా రాజేశ్వర్‌రెడ్డి, మంత్రివర్యులు జగదీష్‌రెడ్డిగారికి, నెలరోజుల పాటు తమ హోదాలు పక్కనపెట్టి నా గెలుపు కృషి చేసిన అందరికి వందనం చేస్తున్నా. నిన్నటి వరకు శానంపూడి సైదిరెడ్డిని. నేటి నుంచి సైదిరెడ్డి ఎమ్మెల్యేని. ఇకపై కూడా మీ ఇంటి బిడ్డగానే ఉంటానని పేర్కొన్నారు.