ఏపీలో ఇసుక కొరత ఉందంటూ టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌లు జగన్ సర్కార్‌పై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. తాజాగా ఇసుక కొరతపై స్పందించిన పవన్ ప్రభుత్వం తీసుకువచ్చిన కొత్త ఇసుక విధానం సరిగా లేదని, రాష్ట్రంలో ఇసుక కొరతతో 30 లక్షల మంది భవన నిర్మాణ కార్మికులు ఉపాధి కోల్పోయారని ఆరోపించారు. కొత్తగా తెచ్చే 6వేల ఇసుక లారీలకు జీఎస్టీ తగ్గించేందుకు ప్రభుత్వం తెచ్చిన 486 జీవోపై ప్రధానమంత్రికి ఫిర్యాదు చేస్తానని జనసేనాని ఫైర్ అయ్యారు. పవన్ కల్యాణ్ విమర్శలకు వైసీపీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ధీటుగా కౌంటర్ ఇచ్చారు. చంద్రబాబునాయుడు, పవన్ కల్యాణ్‌లు ఇసుక పై ఒకే పాట పాడుతున్నారని ఆయన మండిపడ్డారు. బాబుకు తొత్తుగా పవన్ పని చేస్తున్నారంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సీఎం జగన్‌పై పదే పదే విమర్శలు చేస్తే..ప్రజలు ఆదరిస్తారనే భ్రమలో ఉన్నారని వెల్లంపల్లి అన్నారు. ఇసుక రవాణాపై పవన్ చేసిన వ్యాఖ్యలపై మంత్రి మండిపడ్డారు. భారీ వరద పోటెత్తడంతో గత 50 రోజులుగా ప్రకాశం బ్యారేజీ గేట్లు తెరిచే ఉన్నాయి. బ్యారేజ్‌లోకి వరద పోటెత్తుతుండడంతో ఇసుక ఎక్కడి నుంచి తీయాలో చెప్పాలని పవన్‌ను వెల్లంపల్లి ప్రశ్నించారు. ఏపీలో టన్ను ఇసుకను నాణ్యమైన ధరకు అందించేందుకు సీఎం జగన్ కృషి చేస్తున్నారని మంత్రి అన్నారు. పథకాలు అందించే క్రమంలో ఇబ్బందులు ఎదురవుతాయని తెలిసినా..పవన్ కల్యాణ్ ఇష్టం వచ్చినట్లు విమర్శలు చేయడం సమంజసం కాదని పేర్కొన్నారు. అసలు పవన్ అధికారం లేకుండా ఉండలేడని, అందుకే 2009లో తన అన్న చిరంజీవి అధికారంలోకి రాలేదని అర్థంతరంగా పార్టీలో నుంచి బయటకు వచ్చారని వెల్లంపల్లి సంచలనవ్యాఖ్యలు చేశారు. అలాగే చంద్రబాబు ఐదేళ్లు అధికారంలో ఉండగా ఆయన తోక పట్టుకొని తిరిగారని, ఇప్పటికీ బాబుకు తొత్తుగానే పవన్ వ్యవహరిస్తున్నారని మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికలకు ముందు ఉత్తరాధి, దక్షిణాది అంటూ మోదీని విమర్శించిన పవన్ ఇప్పుడు ఎలాగైనా చంద్రబాబుతో కలిసి, మోదీతో కలవాలని ప్రయత్నిస్తున్నారన్నారు. బాబు, పవన్‌లు చేస్తున్న నీచ రాజకీయాలను ప్రజలు గమనిస్తున్నారని మంత్రి వెల్లంపల్లి కౌంటర్ ఇచ్చారు.
