కృష్ణా జిల్లా సీనియర్ తెలుగుదేశం పార్టీ నాయకుడు గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్ వైసీపీలో చేరిక దాదాపుగా ఖరారైంది. వంశీ స్నేహితుడు పౌర సరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని, సమాచార శాఖ మంత్రి పేర్ని నాని ల తో కలిసి శుక్రవారం సాయంత్రం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నివాసానికి చేరుకున్న వంశీ కొద్దిసేపు జగన్ తో చర్చలు జరిపారు. వైసీపీలోకి వస్తున్నట్టుగా తన నిర్ణయాన్ని వెల్లడించగా జగన్ స్వాగతించినట్టు సమాచారం. గతంలోనే వంశీ వైసీపీలో చేరాల్సి ఉంది. అయితే వివిధ కారణాలు రాజకీయ సమీకరణాల నేపథ్యంలో ఆయన టీడీపీలోనే ఉండి పోయారు. గతంలో దాదాపుగా పదేళ్ల క్రితం జగన్ ఓదార్పు యాత్ర చేస్తున్న సమయంలో వంశీ ఆయనను బెజవాడలో ఆలింగనం చేసుకున్నారు. అప్పటి నుంచి తెలుగుదేశం పార్టీ అధిష్టానం వంశీని అనేక ఇబ్బందులకు గురి చేసింది. అనేక పార్టీ కార్యక్రమాలకు ఆయనకు ఆహ్వానం పంపలేదు. చాలా సందర్భాల్లో వంశీని దూరం పెట్టారు. అయినా వంశీ ఇవన్నీ దిగమింగుకుని పార్టీ కోసమే పని చేశారు. తాజాగా గన్నవరం అభివృద్ధి తన స్నేహితుల కోరిక జగన్ నాయకత్వానికి జై కొట్టేందుకు వంశి సిద్ధమయ్యారు. వైసిపిలో చేరిన మరికొద్ది రోజుల్లోనే గన్నవరం శాసనసభ నియోజకవర్గానికి రాజీనామా చేసి వంశీ మళ్లీ ఎన్నికలకు వెళ్లనున్నారు.
