గుంటూరు జిల్లా దాచేపల్లి మండలం పెదగార్లపాడు గ్రామంలో జరిగిన ఘటనపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. నిందితులు ఎంతటివారైనా చట్టపరంగా వెంటనే చర్యలు తీసుకోవాల్సిందిగా డీజీపీకి, కలెక్టర్‌కు ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రంలో మరెక్కడా ఇలాంటి ఘటనలు జరగడానికి వీల్లేకుండా కఠినంగా వ్యవహరించాలని పోలీసులు, అధికారులను సీఎం ఆదేశించారు. ప్రభుత్వం తరపున బాధిత బాలికకి అండగా నిలవాలన్నారు. ఈ ఘటనపై హోంమంత్రి సుచరిత మాట్లాడుతూ.. లైంగిక దాడి జరిగిన 24 గంటల్లోనే నిందితుడిని అరెస్ట్ చేశాం. చట్టపరంగా చర్యలు తీసుకోమని అధికారులను ఆదేశించాం. ప్రస్తుతం బాలిక ఆసుపత్రిలో కోలుకుంటోంది. ప్రభుత్వం తరపున బాధితురాలి కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటామని హామీ ఇచ్చారు. భవిష్యత్తులో ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూస్తామని తెలిపారు. రాష్ట్ర మహిళా కమిషన్ చైర్‌పర్సన్ వాసిరెడ్డి పద్మ బాలికను పరామర్శించారు. ప్రభుత్వం నుంచి సహాయం సత్వరం అందే విధంగా కృషి చేయడంతో పాటూ, గ్రామంలో రక్షణ కూడా కల్పిస్తామని వెల్లడించారు. లైంగిక దాడికి గురై నరసరావుపేట ప్రభుత్వ వైద్యశాలలో చికిత్స పొందుతున్నబాలికను పరామర్శించి, సంఘటన గురించి బాలిక తల్లితండ్రుల్ని అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం అండగా ఉంటుందని, ధైర్యంగా ఉండాలని చెప్పారు.
