టీడీపీ అధినేత చంద్రబాబుకు చుక్కలు చూపించాలని కేంద్రంలోని మోదీ సర్కార్ డిసైడ్ అయిందా..గత ఎన్నికలకు ముందు తమ కూటమి నుంచి బయటకు వెళ్లి ఓట్ల కోసం మోదీపై అడ్డమైన కూతలు కూసిన చంద్రబాబుకు తగిన గుణపాఠం చెప్పాలని బీజేపీ పెద్దలు భావిస్తున్పారా..మళ్లీ కేసుల భయంతో పొత్తు కోసం వెంపర్లాడుతున్న చంద్రబాబుపై కాషాయనాథులు ఆగ్రహంతో ఉన్నారా..త్వరలోనే టీడీపీ హయాంలో జరిగిన అవినీతిపై సీబీఐ విచారణకు కేంద్రం ఆదేశించనుందా.. చిదంబరం తర్వాత మోదీ,షాల నెక్ట్స్ టార్గెట్ చంద్రబాబేనా.. ప్రస్తుతం ఏపీ బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు విష్ణువర్థన్ రెడ్డి వ్యాఖ్యలు చూస్తే త్వరలోనే బాబుగారు జైలుకు వెళ్లడం ఖాయంగా కనిపిస్తుంది.
తాజాగా రాజమండ్రిలో విలేకరులతో మాట్లాడిన విష్ణువర్ణన్ రెడ్డి చంద్రబాబు హయాంలో ల్యాండ్‌పూలింగ్ పేరుతో భారీగా అవినీతి జరిగిందని సంచలన ఆరోపణలు చేశాడు. అలాగే పోలవరంతో సహా పలు సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణంలో చంద్రబాబు, లోకేష్‌లతో సహా టీడీపీ నేతలు కాంట్రాక్టర్ల ముసుగులో భారీగా దోపిడీకి పాల్పడ్డారని విష్ణువర్థన్ రెడ్డి ఆరోపించారు. ముఖ్యంగా అమరావతి , పోలవరంతో సహా వివిధ ప్రభుత్వ శాఖల్లో జరిగిన అవినీతిపై జగన్ సర్కార్ సీబీఐ దర్యాప్తును కోరుకుంటే కేంద్రం కచ్చితంగా విచారణ చేయిస్తుందని స్పష్టం చేశారు. ప్రతిపక్షంలో ఉండగా అమరావతి, పోలవరంలో అవినీతి జరిగిందని విమర్శించిన జగన్..ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఎందుకు సీబీఐ దర్యాప్తును కోరడం లేదని విష్ణువర్థన్ రెడ్డి నిలదీశారు. ఒకవేళ సీఎం జగన్ కోరుకుంటే.. తానే చొరవ తీసుకుని సీబీఐ ఎంక్వైరీ జరిగేలా చూసుకుంటానని, గత ఐదేళ్లలో జరిగిన పలు అక్రమాలను తేలుస్తామని బీజేపీ నేత విష్ణువర్థన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశాడు.
ఇప్పటికే జగన్ సర్కార్ పోలవరంలో రివర్స్ టెండరింగ్‌కు వెళ్లింది. బాబు హయాంలో జరిగిన అవినీతిపై కమిటీ వేసింది. అలాగే అమరావతిలో గత ఐదేళ్లలో జరిగిన అవినీతిపై కూడా ప్రభుత్వం కమిటీ వేసింది. చంద్రబాబు హయాంలో రాజధానిలో జరిగిన క్రయ విక్రయాల్లో భారీగా ఇన్‌సైడర్ ట్రేడింగ్ జరిగిందని ఆ కమిటీ గుర్తించింది. త్వరలోనే కమిటీ ప్రభుత్వానికి నివేదక అందించనుంది. కమిటీ నివేదిక రాగానే ప్రభుత్వం అవినీతికి బాధ్యులైన వారిపై సీబీఐ విచారణ కోరనుంది. ఈ నేపథ్యంలో బీజేపీ నేత విష్ణువర్థన్ రెడ్డి కూడా జగన్ సర్కార్ కోరుకుంటే వెంటనే సీబీఐ విచారణ జరిపిస్తామని ప్రకటించడం ఏపీ రాజకీయవర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే తమను రాజకీయంగా వేధించిన మాజీ కేంద్ర మంత్రి చిదంబరాన్ని జైలుకు పంపించిన మోదీ, షాలు..నెక్ట్స్ తమపై ఎన్నికల ముందు అసభ్యపదజాలంతో దూషించిన చంద్రబాబును కూడా జైలుకు పంపేందుకు రంగం సిద్ధం చేస్తున్నారని సమాచారం. మొత్తంగా త్వరలోనే టీడీపీ హయాంలో జరిగిన అవినీతిపై సీబీఐ విచారణ జరగడం, చంద్రబాబు జైలుకు వెళ్లడం ఖాయంగా కనిపిస్తోంది.