టీడీపీ ఎమ్మెల్యేలకు, ఎంపీలకు ఏపీ హైకోర్ట్ వరుస షాక్‌లు ఇస్తోంది. ఒకపక్క కేసుల్లో రిమాండ్లు, మరోపక్క అనర్హత నోటీసులతో టీడీపీ నేతలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. తాజాగా టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్‌తో సహా, మరో ఇద్దరు ఎమ్మెల్యేలకు హైకోర్ట్ నోటీసులు జారీ చేసింది. 2019 సార్వత్రిక ఎన్నికలలో గుంటూరు ఎంపీ స్థానం నుంచి గల్లా జయదేవ్ కేవలం 4200 ఓట్ల స్వల్ఫ మెజారిటీతో గెలుపొందారు. గల్లా గెలుపుపై అప్పట్లోనే అన్ని ప్రధాన పార్టీలు సందేహాలు వ్యక్తం చేశాయి. వైసీపీ అభ్యర్థి మోదుగుల వేణుగోపాల్ రెడ్డి…గల్లా జయ్‌దేవ్ ఎన్నికను సవాలు చేస్తూ హైకోర్ట్‌ను ఆశ్రయించారు,.. ఓట్ల లెక్కింపు సదర్భంగా గల్లా జయ్‌దేవ్ రిటర్నింగ్ అధికారి అయిన జిల్లా కలెక్టర్‌ను మేనేజ్ చేశారని, దాదాపు 9 వేల పోస్టల్ బ్యాలెట్ ఓట్లు పరిణగనలోకి తీసుకోలేదని మోదుగల ఆరోపించారు. కౌంటింగ్ రోజు గల్లా జయ్‌దేవ్ ఒత్తిడి మేరకు పోస్టల్ బ్యాలెట్ కవర్లపై సీరియల్ నెంబర్లు లేవని రిటర్నింగ్ అధికారి వాటిని రిజెక్ట్ చేశారు. అయితే కవర్లపై సీల్ లేనంత మాత్రాన రిజెక్ట్ చేయాల్సిన అవసరం లేదని మోదుగల వాదించారు. ఈ 9 వేల పోస్టల్ బ్యాలెట్ ఓట్ల విషయంలో గుంటూరు పార్లమెంట్ పరిధిలోని మంగళగిరి ఎమ్మెల్యే అభ్యర్థి ఆళ్ల రామకృష్ణారెడ్డికి, రిటర్నింగ్ అధికారికి తీవ్ర వాగ్వివాదం కూడా జరిగింది. ఒక వేళ రిటర్నింగ్ అధికారి ఆ 9 వేల పోస్టల్ బ్యాలెట్ ఓట్లను పరిగణనలోకి తీసుకుంటే మోదుగుల గెలిచే అవకాశం ఉండేది. దీంతో మోదుగల గల్లా జయదేవ్ ఎన్నికపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ హైకోర్ట్‌లో పిటీషన్ వేశారు. ఈ మేరకు న్యాయస్థానం గల్లా జయ్‌దేవ్‌కు, ఎన్నికల రిటర్నింగ్ అధికారికి నోటీసులు జారీ చేసింది.
ఇదే సమయంలో హైకోర్ట్ మరో ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలకు కూడా నోటీసులు జారీ చేసింది. పాలకొల్లు ఎమ్మెల్యే ఎన్నికను సవాలు చేస్తూ వైసీపీ అభ్యర్థి సత్యనారాయణమూర్తి తరుపున వాసుదేవరావు పిటీషన్ వేయగా, విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు ఎన్నికను సవాలు చేస్తూ శ్రీనివాస రెడ్డి హైకోర్ట్ పిటీషన్ దాఖలు చేశారు. దీంతో ఈ ఇద్దరు ఎమ్మెల్యేలకు హైకోర్ట్ నోటీసులు జారీ చేసింది. హైకోర్ట్ నోటీసుల నేపథ్యంలో గల్లాతో సహా, గద్దె, నిమ్మల ఎన్నికపై సందిగ్ధం నెలకొంది. ఒకవేళ పోస్టల్ బ్యాలెట్ ఓట్లను లెక్కించాల్సిందే అని హైకోర్ట్ తీర్పు ఇస్తే మోదుగుల విజయావకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే రాష్ట్రంలో అన్ని ఎంపీ, ఎమ్మెల్యే స్థానాలలో పోస్టల్ బ్యాలెట్లో వైసీపీ అభ్యర్థులే ఆధిక్యం సంపాదించారు. ఈ నేపథ్యంలో పోస్టల్ బ్యాలెట్ లెక్కిస్తే గల్లా పదవి గల్లంతు అయ్యే అవకాశాలు ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయి. ఇక స్వల్ఫ మెజారిటీతో గెలుపొందిన టీడీపీ ఎమ్మెల్యేలు గద్దె రామ్మోహన్ రావు, నిమ్మల రామానాయుడు ఎన్నిక కూడా హైకోర్ట్ నోటీసులతో డోలాయమానంలో పడింది. మొత్తంగా గల్లాతో సమా, గద్దె, నిమ్మల పదవులు ఊస్టింగే అని ఏపీ రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.