తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ,అధికార టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఈ రోజు హుజూర్ నగర్ లో జరిగిన ప్రజాకృతజ్ఞత సభకు ముఖ్య అతిథిగా హజరయ్యారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడుతూ” ” హుజూర్‌నగర్ ఓటర్లకు రాష్ట్ర ప్రజల పక్షాన, నా పక్షాన, టీఆర్ఎస్ పార్టీ తరపున హృదయపూర్వక ధన్యవాదాలు. ఎన్నో నీలాపనిందలను విశ్లేషణ చేసి, బల్లగుద్ది మరీ, హుజూర్‌నగర్ తీర్పు ఇచ్చింది. ఇది మామూలు విజయం కాదు..మీరు ఇచ్చిన విజయం మరింత అంకితభావంతో పని చేసే స్ఫూర్తి కలిగించింది. సైదిరెడ్డి నాయకత్వంలో హుజూర్‌నగర్ నిజమైన హుజూర్ అనే పరిస్థితి రావాలి. 134 గ్రామపంచాయతీలు ఏవైతే ఉన్నాయో..ప్రతి గ్రామ పంచాయతీకి, రూ.25 లక్షల చొప్పున ముఖ్యమంత్రి ప్రత్యేక నిధి నుంచి మంజూరు చేస్తానని మనవి చేస్తున్నా. హుజూర్‌నగర్‌లోని ప్రతి మండల కేంద్రానికి రూ. 30 లక్షలు మంజూరు చేస్తున్నాం. హుజూర్‌నగర్ మున్సిపల్ పట్టణానికి ముఖ్యమంత్రి ప్రత్యేక నిధి నుంచి రూ. 25 కోట్లు మంజూరు చేస్తున్నాం. దుమ్ము, ధూళి లేకుండా ఉమ్మడి నల్లొండ జిల్లాలో పరిశుభ్రమైన పట్టణంగా హుజూర్‌నగర్‌ను తయారు చేయాలి. నేరేడుచర్ల పట్టణ అభివృద్ధికి రూ. 15 కోట్లు మంజూరు చేస్తున్నాం. నేరేడుచర్లను కూడా బ్రహ్మాండంగా తీర్చిదిద్దాలని కోరుతా ఉన్నా. హుజూర్‌నగర్‌లో గిరిజన బిడ్డల కోసం రెసిడెన్షియల్ స్కూల్ మంజూరు చేస్తా ఉన్నాం. అదేవిధంగా బంజారా భవన్ కూడా నిర్మిస్తాం. 1997లో నేను కరువు మంత్రిగా ఉన్నప్పుడు ఏ సమస్యలైతే చెప్పారో.. ఇప్పటికీ అవే సమస్యలు ఉన్నాయి. ఒక్క హుజూర్‌నగరే కాదు మిర్యాలగూడ, నాగార్జునసాగర్, తదితర ప్రాంతాల్లో కొంత పోడు భూముల సమస్య ఉంది. త్వరలోనే అన్ని జిల్లాల్లో ప్రజా దర్బార్‌లు పెట్టి పోడు భూముల సమస్యను పరిష్కారిస్తాం. హుజూర్‌నగర్ ప్రజల చిరకాల కోరిక అయిన రెవిన్యూ డివిజన్‌ను వెంటనే మంజూరు చేస్తున్నాం. కేంద్రంతో మాట్లాడి తప్పకుండా హుజూర్‌నగర్‌లో ఈఎస్‌ఐ ఆసుపత్రి మంజూరు చేస్తున్నాం. సిమెంట్ ఫ్యాక్టరీల్లో పని చేసేవారికి ఈఎస్‌ఐ ఆసుపత్రి సదుపాయం కల్పిస్తాం. హుజూర్‌నగర్‌కు పాలిటెక్నిక్ కాలేజీ కూడా వెంటనే మంజూరు చేయిస్తున్నామని మనవి చేస్తున్నా. హైకోర్ట్ సీజేతో మాట్లాడి హుజూర్‌నగర్ కోర్టు పరిధిలోకి మేళ్లచెర్వు, చింతలపాలెం మండలాలను తీసుకువస్తాం. హుజూర్‌నగర్‌లో వీలైనంత త్వరలో ఎక్కువ మొత్తంలో డబుల్ బెడ్‌రూం ఇండ్లు కట్టించి ఇస్తం. ఈ జిల్లామంత్రి పెన్‌పహాడ్ మండలంలో చివరి గ్రామాల వరకు, తుంగతుర్తి వరకు, నడిగూడెం, కోదాడ వరకు, కాళేశ్వరం జలాలతో ఈ జిల్లా భూములను పునీతం చేస్తా ఉన్నాడు. రూ. 30 వేల కోట్లతో నిర్మాణం అవుతున్న యాదాద్రి అల్ట్రా మెగా ప్లాంట్‌ను ఈ జిల్లాకు మంత్రి తెచ్చినాడు. మిర్యాలగూడ దామరచర్ల మండలంలో నిర్మాణం జరుగుతోంది. త్వరలోనే పూర్తి అవుతుంది. యాదాద్రి పవర్ ప్లాంట్‌ను మూసేస్తమని కాంగ్రెస్ నాయకులు చెబుతున్నరు. కాంగ్రెస్ నాయకుల మాటలను వాళ్ల విజ్ఞతకే వదిలేస్తం. యాదాద్రి మెగా ప్లాంట్ పూర్తయితే సూర్యాపేట జిల్లా ముఖచిత్రమే మారిపోతుంది. ఉమ్మడి నల్లొండ జిల్లాది చాలా విచిత్రమైన చరిత్ర. నాగార్జునసాగర్ ప్రాజెక్టు అసలు పేరు..నందికొండ. నిజాం పాలనలో మన కోసం తలపెట్టిన ప్రాజెక్టు..నందికొండ ప్రాజెక్టు. నాగార్జునసాగర్ నుండి మనకు 180 టీఎంసీలు, ఆంధ్రా ప్రాంతానికి 60 టీఎంసీలు అని నిజాంకాలంలోనే ఆలోచన మొదలైంది. ఆ తర్వాత మారి మారి, మీకు 132, మాకు 132 అన్నారు. ఆ తర్వాత మళ్లీ 25 టీఎంసీలు కొట్టేశారు. మనకు 107 టీఎంసీలు రావాలి. కానీ ఎన్నడూ కూడా మనకు 100 టీఎంసీలు రాలేదు. అప్పటి నుంచి అన్యాయం జరుగుతా ఉంది. ఉమ్మడి నల్గోండ జిల్లాలో 10 లక్షల ఎకరాలు పారాలి..కానీ ఎక్కడా పారుతలేదు. నాగార్జునసాగర్ ఆయకట్టును మనం కాపాడుకోవాలి. నల్లొండ జిల్లాలో ఆయకట్టుబాధలు శాశ్వతంగా పోవాలి. గోదావరి నీళ్లు నాగార్జున ఎడమ కాల్వలో పడాలి. కేసీఆర్‌గా, మీ బిడ్డగా మీకు ఒకటే చెబుతున్నా..రాబోయే 15 రోజుల్లో కోదాడ నుండి నాగార్జున సాగర్ ప్రాజెక్టు వరకు పర్యటించి ఆయకట్టు సమస్యలకు శాశ్వత పరిష్కారం చేయిస్తాను. తెలంగాణలో ఎక్కడ నీళ్లు రాకపోయినా..దుఃఖం నాదే. అవసరమైన లిఫ్ట్‌లు నిర్మిస్తాం..కాల్వలు మరమ్మత్తులు చేయిస్తాం. హుజూర్‌నగర్‌లో ప్రతి ఇంచుకు నీళ్లు పారిస్తం.
హుజూర్‌నగర్ రింగ్ రోడ్డు..ట్యాంక్‌బండ్‌లాగా చెరువుకట్ట సుందరీకరణకు వెంటనే నిధులు మంజూరు చేసి, పనులు కూడా చేయిస్తామని మనవి చేస్తున్నా “అని అన్నారు.
