తెలంగాణ రాష్ట్రమేర్పడిన తర్వాత అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్ ఒకవైపు సంక్షేమం మరో వైపు అభివృద్ధి పథంలో రాష్ట్రాన్ని నెంబర్ వన్ స్థానంలో నిలబెడుతుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో టీఆర్ఎస్ ప్రభుత్వం పలు సంక్షేమాభివృద్ధి కార్యక్రమాలను అమలు చేస్తూ అన్ని వర్గాల మన్నలను పొందుతుంది.
ఈ క్రమంలో తెలంగాణ ఏర్పడిన తర్వాత ప్రతి ఉప ఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్థులు భారీ మెజారిటీతో గెలుపొందుతున్నారు.తాజాగా గురువారం విడుదలైన హుజూర్ నగర్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ 43,358ఓట్ల మెజారిటీతో గెలుపొంది సరికొత్త చరిత్రను సృష్టించింది. ఇప్పటివరకు జరిగిన ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ సాధించిన విజయాలపై ఒక లుక్ వేద్దాం.
తెలంగాణ ఏర్పడిన తర్వాత జరిగిన తొలి ఉప ఎన్నిక అయిన సీఎం కేసీఆర్ ప్రాతినిధ్యం వహించిన మెదక్ లోక్ సభకు జరిగిన ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థిగా బరిలోకి దిగిన కొత్త ప్రభాకర్ రెడ్డి 3,61,277ఓట్ల మెజారిటీతో కాంగ్రెస్ అభ్యర్థి,మాజీ మంత్రి సునీతా లక్ష్మారెడ్డిపై అఖండ విజయాన్ని సాధించాడు. వరంగల్ ఎంపీగా ఉన్న కడియం శ్రీహారి రాజీనామాతో జరిగిన ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ తరపున పోటికి దిగిన పసునూరి దయాకర్ కాంగ్రెస్ అభ్యర్థి సర్వే సత్యనారాయణపై 4,59,088ఓట్ల మెజారిటీతో గెలుపొంది రికార్డు సృష్టించాడు.
నారాయణ ఖేడ్ ఎమ్మెల్యేగా ఉన్న పి. కృష్ణారెడ్డి అకాలమరణంతో జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి ,ఆయన కుమారుడు సంజీవరెడ్డిపై టీఆర్ఎస్ అభ్యర్థి ఎం భూపాల్ రెడ్డి 53,625ఓట్ల మెజారిటీతో గెలుపొందాడు. పాలేరు ఎమ్మెల్యేగా ఉన్న రాంరెడ్డి వెంకట రెడ్డి మృతిచెందడంతో జరిగిన ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ తరపున బరిలోకి దిగిన తుమ్మల నాగేశ్వర్ రావు వెంకటరెడ్డి సతీమణి సుచరితా రెడ్డిపై 45,676ఓట్ల మెజారిటీతో గెలుపొందారు.