హిందూపురం టీడీపీ ఎమ్మెల్యే, సినీనటుడు బాలయ్యకు సొంత ఇలాకాలో చేదు అనుభవం ఎదురైంది. వ్యక్తిగత పనిపై నియోజకవర్గానికి వెళ్లిన బాలయ్యను స్థానికులు అడ్డుకుని ఘోరావ్ చేశారు. అక్టోబర్ 24న గురువారం నాడు టీడీపీ అధికార ప్రతినిధి రమేష్ కుమార్తె వివాహానికి హాజరయ్యేందుకు వెళుతున్న ఎమ్మెల్యే బాలకృష్ణను లేపాక్షి మండలం, గలిబిపల్లి గ్రామస్థులు అడ్డుకున్నారు. తమ ఊరిని పట్టించుకోవడం లేదంటూ నిరసన వ్యక్తం చేశారు. వివరాల్లోకి వెళితే.. మూడేళ్ల కిందట హిందూపురం–చిలమత్తూరు మెయిన్‌రోడ్ నుంచి రూ.70 లక్షల వ్యయంతో గలిబిపల్లికి రోడ్డు నిర్మాణపనులకు అప్పుడు ఎమ్మెల్యేగా ఉన్న బాలయ్య భూమి పూజ చేశాడు. కాని నిర్మాణపనులు మాత్రం ప్రారంభించలేదు. అయితే 2019 ఎన్నికలు దగ్గరపడుతున్నాయని ఏడాది కిందట రోడ్డు వేస్తున్నట్లు పనులు ప్రారంభించి హడావుడి చేయించాడు. కానీ ఆ తర్వాత మళ్లీ పట్టించుకోలేదు. ఈ నేపథ్యంలో మళ్లీ గెలిచిన తర్వాత తొలిసారి నియోజకవర్గానికి బాలకృష్ణ వస్తున్నారన్న విషయం తెలుసుకున్న గ్రామస్తులు గురువారం నాడు మెయిన్ రోడ్‌పై బైఠాయించి.. ఆయన కారును అడ్డుకున్నారు. మూడేళ్లయినా తమ ఊరికి రోడ్డు ఎందుకు వేయించలేకపోయావో చెప్పాలంటూ బాలయ్యను నిలదీశారు. వర్షం వచ్చినప్పుడల్లా నరకయాతన పడుతున్నామని.. బైక్‌ల మీద నుంచి కిందపడి తీవ్ర గాయాలపాలవుతున్నామని వాపోయారు. ఇంతలో టీడీపీ నాయకులు కల్పించుకుని అప్పట్లో కోడ్ రావడంతో పనులు జరగలేదని, ఇప్పుడేమో ప్రభుత్వం మారిపోయిందని చెప్పడంతో.. గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఐదేళ్లుగా ఇవే సాకులు చెబుతున్నారని మండిపడ్డారు. దీంతో బాలయ్య అధికారులతో మాట్లాడి త్వరలోనే రోడ్డు వేయిస్తానని నచ్చచెప్పినా.. గ్రామస్తులు వెనక్కితగ్గలేదు. దీంతో చిన్నబుచ్చుకున్న బాలయ్య తీవ్ర అసహనం వ్యక్తం చేస్తూ..అక్కడ నుంచి వెళ్లిపోయాడు.బాలయ్య తీరుకు నిరసనగా గ్రామస్తులు భిక్షాటన చేసి నిరసన తెలిపారు. మొత్తంగా రెండవసారి గెలిచిన తర్వాత హిందూపురం వెళ్లిన బాలయ్యకు గలిబిపల్లి గ్రామస్తుల చేతిలో ఘోర అవమానం ఎదురైంది.
