వైవీ సుబ్బారెడ్డి నాయకత్వంలోని టీటీడీ కొత్త పాలకమండలి రోజుకో సంచలన నిర్ణయంతో తిరుమల తిరుపతిలో విప్లవాత్మక సంస్కరణలు చేపడుతోంది. తాజాగా అక్టోబర్ 23 న బుధవారం నాడు ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో తిరుపతిలో సంపూర్ణమద్య నిషేధానికి సిఫార్స్ చేసింది. కాగా ఏడుకొండలవాడు కొలువైన తిరుమలలో ఇప్పటికే మద్యనిషేధం అమలులో ఉంది. సిగరెట్లు, గుట్కాలు వంటివి పూర్తిగా నిషేధించారు. కాగా కొండ కింద తిరుపతి నగరంలో సంపూర్ణ మద్యనిషేధం అమలు చేయాలని టీటీడీ కొత్త పాలకమండలి ప్రభుత్వాన్ని కోరింది. ప్రతి రోజూ వేలాదిగా తరలివచ్చే భక్తులతో తిరుపతి నగరం ఏపీలోనే ప్రముఖ ఆధ్యాత్మిక పర్యాటక నగరంగా పేరుగాంచింది. దీంతో లాడ్జ్‌లు హోటళ్లు, వైన్ షాపులు, బార్ అండ్ రెస్టారెంట్లు, రిసార్ట్లు పెద్ద ఎత్తున ఏర్పాటు అయ్యాయి. దీంతో మద్యం బాబులతో తిరుమలకు వచ్చే భక్తులకు ఇబ్బందిగా మారింది. దీంతో తిరుపతి నగరంలో కూడా సంపూర్ణ మద్యనిషేధం అమలుకై టీటీడీ పాలకమండలి ప్రభుత్వానికి సిఫార్స్ చేసింది. ఇప్పటికే ఏపీలో దశలవారీగా మద్యనిషేధం దిశగా అడుగులు వేస్తున్న జగన్ సర్కార్ టీటీడీ సిఫార్స్ మేరకు తిరుమలలోనే కాకుండా కొండ కింద విస్తరించిన తిరుపతి నగరంలో కూడా సంపూర్ణ మద్య నిషేధం విధించే అవకాశాలు ఉన్నాయి. మొత్తంగా తిరుమల వేంకటేశ్వరుడు కొలువైన పవిత్ర పుణ్యక్షేత్రంలో సంపూర్ణ మద్యపానం దిశగా టీటీడీ పాలకమండలి ముందడుగు వేయడం అభినందనీయం.
