తెలంగాణ రాష్ట్రంలో నల్లగొండ జిల్లా అంటేనే కాంగ్రెస్ పార్టీకి ఒకప్పుడు అడ్డా.. అందులో హుజూర్ నగర్ అసెంబ్లీ నియోజకవర్గం అంటే కాంగ్రెస్ ఇలాఖా. అందులోనూ ఆ పార్టీ తెలంగాణ విభాగ అధ్యక్షుడు.. నల్లగొండ ఎంపీ ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తోన్న నియోజకవర్గం. ఇటీవల జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో ఉత్తమ్ కుమార్ రెడ్డి నల్లగొండ ఎంపీగా గెలుపొందడంతో హుజూర్ నగర్ ఎమ్మెల్యేగా ఆయన రాజీనామా చేయాల్సి వచ్చింది.
దీంతో ఉప ఎన్నికలు అనివార్యమయ్యాయి. ఈ ఉప ఎన్నికల బరిలో టీఆర్ఎస్ పార్టీ తరపున శానంపూడి సైదిరెడ్డి, కాంగ్రెస్ పార్టీ తరపున ఉత్తమ్ సతీమణి అయిన ఉత్తమ్ పద్మావతి రెడ్డి బరిలోకి దిగారు. ఈ రోజు ఉదయం ఎనిమిది గంటల నుండి వెలువడుతున్న ఉప ఎన్నికల ఫలితాల్లో మొదటి రౌండ్ నుండి టీఆర్ఎస్ పార్టీదే హావా.. ఇప్పటివరకు వెలువడిన ఫలితాల్లో భాగంగా పది రౌండ్లు ముగిసేసరికి టీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీపై ఇరవై వేలకు పైగా ఓట్ల మెజారిటీతో అధిక్యంలో ఉంది.
ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీకి ముఖ్యంగా ఉత్తమ్ కుమార్ రెడ్డికి అడ్డా అయిన నేరేడుచర్ల మండలంలో ఆ పార్టీ కంటే టీఆర్ఎస్ పార్టీకే పదివేలకు పైగా ఓట్ల అధిక్యం వచ్చింది. ఓట్ల లెక్కింపు ప్రక్రియ ముగిసేవరకు దాదాపు ఇరవై ఐదు వేల నుండి ముప్పై వేల మెజారిటీతో శానంపూడి సైదిరెడ్డి గెలవడం ఖాయమని అంటున్నారు విశ్లేషకులు.