నీతి ఆయోగ్ ర్యాంకులపై టీడీపీ విమర్శలను ఆర్దిక మంత్రి బుగ్గన రాజేంద్రనాదరెడ్డి ఘాటుగా జవాబు ఇచ్చారు. గత ప్రభుత్వ వైపల్యాలను తమపై రుద్దాలని చంద్రబాబు,యనమల ప్రయత్నిస్తున్నారని ఆయన అన్నారు.’గత ప్రభుత్వం చెప్పినట్లుగా బడ్జెట్లో కేటాయింపులు చేయలేదు. ఇప్పుడు నీతి ఆయోగ్ నివేదికలో రాష్ట్రం 10 వ ర్యాంక్‌కు దిగజారామని మాట్లాడుతున్నారు. దీనికంతటికి కారణం గత ప్రభుత్వ వైఫల్యమే. చంద్రబాబు ప్రభుత్వం రూ. 2 లక్షల 60 కోట్ల అప్పులు చేసింది. అప్పులు చేసి.. వాటిని మాపై నెట్టి విమర్శిస్తున్నారు. విద్యుత్ డిస్కంలను నష్టాల్లోకి నెట్టారు. విద్యుత్‌ను అధిక ధరకు కొన్నామని ప్రచారం చేస్తున్నారు. కర్ణాటక నుంచి థర్మల్ విద్యుత్ కొనుగోలు కోసం 2018 అక్టోబర్‌లో ఒప్పందం చేసుకున్నది టీడీపీ ప్రభుత్వమే. సౌర, పవన విద్యుత్‌లు అన్ని సమయాల్లో రావని టీడీపీ నేతలకు తెలియదా’ అని బుగ్గన అన్నారు. అదే విధంగా ఇసుక సమస్యకు చంద్రబాబు పాలనలో జరిగిన దోపిడే కారణమని విమర్శించారు. ప్రస్తుతం వర్షాలు, వరదలు ఎక్కువగా ఉండటం వలన కొన్ని సమస్యలు తలెత్తాయి. ఇవన్నీ తెలిసి కూడా చంద్రబాబు, యనమల, టీడీపీ నేతలు ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడుతున్నారు అని మండిపడ్డారు.
