ముఖ్యమంత్రి కేసీఆర్, టీఆర్ఎస్ ప్రభుత్వంపై ప్రజల నమ్మకానికి నిదర్శనం హుజూర్ నగర్ ఉప ఎన్నిక ఫలితమని మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు. హుజూర్ నగర్ ప్రజలు అఖండ మెజార్టీతో శానంపూడి సైదిరెడ్డిని గెలిపించిన సందర్భంగా మంత్రి జగదీష్ రెడ్డి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. సీఎం కేసీఆర్, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మార్గదర్శకంలో టీమ్ వర్క్ తో విజయం సాధించాం. తామే అభ్యర్థులు అన్నట్టుగా నాయకులు, క్యాడర్ పనిచేశారు. ఓడిపోయినా సైదిరెడ్డి ప్రజల మధ్యే ఉన్నారు. తమ స్థాయికి దిగజారి విపక్ష నేతలు విమర్శలు చేశారు. విపక్షాల కుటిల యత్నాలను ప్రజలు తిప్పికొట్టారు. బీజెపి, కాంగ్రెస్ ఏకమై మా ప్రచారాన్ని అడ్డుకునేందుకు ఎన్నికల అధికారులను ఉపయోగించుకున్నారన్నారు. కేటీఆర్ రోడ్ షోలు, కేసీఆర్ సభ రద్దయినా..ప్రజలకు సందేశం చేరవేయడంలో కార్యకర్తలు సక్సెస్ అయ్యారని జగదీష్ రెడ్డి అన్నారు. ఎల్లుండి సాయంత్రం 4 గంటలకు హుజూర్ నగర్ లో అదే ప్రాంగణంలో సీఎం కేసీఆర్ కృతజ్ఞతా సభ నిర్వహించనున్నట్లు చెప్పారు.
