హిందూ ధర్మ ప్రచారాయాత్రలో భాగంగా విశాఖ శ్రీ శారదాపీఠం ఉత్తరాధికారి శ్రీ శ్రీ శ్రీ స్వరూపానందేంద్ర సరస్వతి స్వామివారు హైదరాబాద్‌లో పర్యటిస్తున్నారు. జూబ్లిహిల్స్ ఎమ్మెల్యే కాలనీలోని జలవిహార్ రామరాజు నివాసంలో రెండు రోజులుగా శ్రీ రాజశ్యామల అమ్మవారికి పీఠపూజలు చేస్తూ, వివిధ ఆలయాలను దర్శిస్తున్నారు. ఇవాళ స్వామివారు చందానగర్ శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయంలో జరుగుతున్న బ్రహ్మోత్సవాలలో స్వామివారు పాల్గొన్నారు. స్వామివారి ఆగమనం సందర్భంగా అర్చకులు, ఆలయ అధికారులు పూలవర్షం కురిపిస్తూ, పూర్ణకుంభంతో సంప్రదాయబద్ధంగా స్వాగతం పలికారు. ముందుగా ఆలయంలో నూతనంగా ఏర్పాటు చేసిన వాటర్ ఫౌంటేయిన్‌లో శ్రీ కృష్ణుడి విగ్రహాన్ని స్వామివారు ఆవిష్కరించారు. తదనంతరం శ్రీ వేంకటేశ్వరుడిని దర్శించుకున్న శ్రీ స్వాత్మానందేంద్ర ప్రత్యేక పూజలు చేశారు. పూజల తర్వాత స్వామివారు శ్రీ వేంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలలో పాల్గోని ఉత్సవమూర్తులకు పూజలు చేసి, భక్తులకు అనుగ్రహభాషణం చేశారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు, అధికారులు శ్రీ స్వాత్మానందేంద్రకు పుష్పాభిషేకం చేసి, స్వర్ణ కిరిటీ ధారణ చేశారు. శ్రీ వేంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలకు స్వామివారి రాక సందర్భంగా భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి ఆశీస్సులు తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో జలవిహార్ రామరాజు, హిందూ ధర్మ ప్రచారయాత్ర తెలుగు రాష్ట్రాల సమన్వయకర్త, దరువు ఎండీ సీహెచ్ కరణ్ రెడ్డి తదితరులు పాల్గోన్నారు.