టీడీపీ అధినేత చంద్రబాబుకు ఆ పార్టీ నేతలు వరుసగా షాక్‌ల మీద షాక్‌లు ఇస్తున్నారు. ఇప్పటికే బాబు తీరుపట్ల అసంతృప్తిగా ఉన్న నేతలు..ఒక్కొక్కరిగా బీజేపీ, వైసీపీలలో చేరుతున్నారు. ఇటీవల తోట త్రిమూర్తులు, జూపూడి వంటి కీలక నేతలు వైసీపీలో చేరగా, మరికొందరు నేతలు పార్టీ జంప్‌కు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. తాజాగా కడప జిల్లాలో కీలక నేత, మాజీమంత్రి ఆదినారాయణరెడ్డి ఇవాళ బీజేపీలో చేరారు. బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ నడ్డా ఆదికి కాషాయ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కాగా ఆదినారాయణరెడ్డి స్వయంగా చంద్రబాబును కలిసి పార్టీ మారే విషయం చెప్పినట్లు సమాచారం. కడప జిల్లాలో బలమైన నేతగా పేరున్న జమ్మలమడుగు మాజీ ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి బీజేపీలో చేరడంతో షాక్‌కు గురైన చంద్రబాబుకు మరో కీలక నేత రామసుబ్బారెడ్డి కూడా కోలుకోలేని దెబ్బ కొట్టాడు. ఇవాళ జమ్మలమడుగులో టీడీపీ కీలక నేత, మాజీ ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి గన్నవరం విమానాశ్రయంలో సీఎం జగన్‌ను కలవడం రాజకీయంగా హాట్‌టాపిక్‌గా మారింది.
జమ్మలమడుగులో తరతరాలుగా ఆదినారాయణరెడ్డి, రామసుబ్బారెడ్డి కుటుంబాల మధ్య ఫ్యాక్షన్ విబేధాలు ఉన్నాయి. 2014 ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి ఆదినారాయణ చేతిలో రామసుబ్బారెడ్డి ఓడిపోయారు. అయితే చంద్రబాబు ఆపరేషన్ ఆకర్ష్‌లో భాగంగా ఆదినారాయణరెడ్డిని టీడీపీలో చేర్చుకుని ఏకంగా మంత్రిపదవి కట్టబెట్టాడు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన రామసుబ్బారెడ్డికి ఎమ్మెల్సీ పదవితో సరిపెట్టాడు. కానీ 2019లో చంద్రబాబు అనూహ్యంగా ఆదినారాయణరెడ్డి కడప ఎంపీ టికెట్ ఇచ్చి, మళ్లీ జమ్మలమడుగు ఎమ్మెల్యే టికెట్ రామసుబ్బారెడ్డికే కట్టబెట్టాడు. కానీ ఇద్దరూ వైసీపీ అభ్యర్థుల చేతిలో ఓడిపోయారు.కాగా ఇప్పటికీ ఇరు వర్గాల మధ్య వర్గ పోరు నివురుగప్పిన నిప్పులా రగులుతూనే ఉంది. ఈ నేపథ్యంలో రామసుబ్బారెడ్డి సీఎం జగన్‌ను విమానాశ్రయంలో కలిసి మాట్లాడడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. అయితే రామసుబ్బారెడ్డి క్యాజువల్‌గా జగన్‌ను కలిశారా..ఏదైనా రాజకీయపరమైన కారణంతో కలిశారా అన్న కోణంలో టీడీపీ అధిష్టానం ఆరా తీస్తోంది. ఇదిలా ఉంటే మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డి బీజేపీలో చేరాడు. ఈ తరుణంలో రామసుబ్బారెడ్డి వైసీపీ వైపు అడుగులు వేస్తున్నారా అన్న అనుమానాలు తలెత్తుతున్నాయి. అదే జరిగితే ఆది, రామసుబ్బారెడ్డిలు మళ్లీ ప్రత్యర్థులుగా మారుతారు. మొత్తంగా ఆదినారాయణరెడ్డి , రామసుబ్బారెడ్డిలు ఒకేరోజు చంద్రబాబుకు దిమ్మతిరిగే షాక్ ఇచ్చారు. ఆదితో పాటు రామసుబ్బారెడ్డి కూడా పార్టీని వీడితే కడప జిల్లాలో టీడీపీ పూర్తిగా కనుమరుగు అవడం ఖాయంగా కనిపిస్తోంది.