ఈ దేశంలో ఆడవాళ్లు అర్థరాత్రి నడిరోడ్డు మీద ఒంటరిగా తిరిగినప్పుడే నిజమైన స్వాతంత్ర్యం అన్నాడు గాంధీ మహాత్ముడు. కానీ దేశంలో ఆడవాళ్లే కాదు..మగవాళ్లు కూడా అర్థరాత్రి నడిరోడ్డుపై తిరిగే స్వేచ్ఛ లేకుండా పోయింది. తాజాగా ఓ మగాడు తమతో సెక్స్ చేయడానికి ఒప్పుకోలేదనే కారణంతో ముగ్గురు మహిళలు అతడిని తీవ్రంగా కొట్టి, డబ్బులు లాక్కున ఘటన బెంగళూరులోని బిఎంటిసి బస్టాండ్ సమీపంలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..మోహన్ కుమార్ అనే డ్రైవర్ అర్థరాత్రి ఉప్పర్ పేట ఫ్లైఓవర్ నుంచి తన ఇంటికి వెళ్తుండగా ముగ్గురు మహిళలు అతడిని అడ్డుకున్నారు. అప్పటికే తప్పతాగిన ఆ ముగ్గురు మహిళలు తమ లైంగిక కోరిక తీర్చాలని మోహన్‌ను బలవంతం పెట్టారు. వారి కోరికను సున్నితంగా తిరస్కరించిన మోహన్ వారి నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నించాడు. దీంతో ఆగ్రహించిన ఆ ముగ్గురు మహిళలు మోహన్‌పై దాడి చేసి తీవ్రంగా కొట్టి, అతడి జేబులో నుంచి పన్నెండు వందల రూపాయలు తీసుకొని అక్కడ నుంచి పారిపోయారు. దీంతో కంగు తిన్న మోహన్ వెంటనే పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశాడు. ఈ ఘటనపై బెంగళూరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఫ్లై ఓవర్ సమీపంలో ఉన్న సీసీ కెమెరాల ఆధారంగా విచారణ జరిపి ఆ ముగ్గురు కిలాడీ మహిళలను అరెస్ట్ చేస్తామని పోలీసులు వెల్లడించారు. మొత్తంగా బెంగళూరులో ఆడవాళ్లకే కాదు..మగవాళ్ల మాన, ప్రాణాలకు కూడా రక్షణ లేకుండా పోయిందని..ఈ ఘటన రుజువు చేస్తుంది.
