జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ఒకపక్క వైసీపీ ప్రభుత్వాన్ని, సీఎం జగన్‌ను పదే పదే టార్గెట్ చేస్తూ విమర్శలు చేస్తూ, ఆ పార్టీ తరపున గెలిచిన ఒకే ఒక ఎమ్మెల్యే మాత్రం సీఎం జగన్ పాలనపై ప్రశంసలు కురిపిస్తున్నారు. గతంలో అసెంబ్లీ సాక్షిగా కోరిన కోర్కెలు తీర్చే దేవత గంగమ్మ తల్లి అయితే, కోరని కోర్కెలు కూడా తీర్చే దేవుడు జగనన్న అని జనసేన ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ సీఎం జగన్‌ను పొగడ్తల వర్షం కురిపించిన సంగతి తెలిసిందే.పలు మార్లు సీఎం జగన్ ప్రజాహిత పాలన చేస్తున్నారంటూ రాపాక మెచ్చుకున్నారు కూడా. తాజాగా తూగో జిల్లా అమలాపురంలో రాజోలు ఎమ్మెల్యే రాపాక స్వయంగా సీఎం జగన్ ఫ్లెక్సీకి పాలాభిషేకం చేసి సంచలనం రేపారు. పాదయాత్రలో ఇచ్చిన హామీ మేరకు సీఎం జగన్ సొంత ఆటోలు కలిగిన డ్రైవర్లకు ఏటా రూ.10 వేల ఆర్థిక సాయం అందించాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఈ మేరకు 400 కోట్లు కేటాయించారు. సీఎం జగన్ నిర్ణయంపై సెంట్రల్ డెల్డా ఆటో వర్కర్స్ యూనియన్‌కు చెందిన డ్రైవర్లు హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు అమలాపురం నల్లవంతెన సెంటర్ ఆటోస్టాండ్ వద్ద ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఫ్లెక్సీకి క్షీరాభిషేకం కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి పినిపే విశ్వరూప్‌తోపాటు జనసేన పార్టీ ఎమ్మెల్యే రాపాక వరప్రసాదరావు పాల్గొన్నారు. జనసేన ఎమ్మెల్యే రాపాక స్వయంగా సీఎం జగన్ ఫ్లెక్సీకి పాలాభిషేకం చేయడం అందరినీ ఆశ్చర్యపరిచింది.. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాపాక వరప్రసాదరావు మాట్లాడుతూ.. ఆటో కార్మికుల సంక్షేమానికి సీఎం జగన్ కృషి చేయడం అభినందనీయమన్నారు. ఒక పక్క జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ సీఎం జగన్ పాలనపై విమర్శలు గుప్పిస్తుంటే..ఆ పార్టీ ఏకైక ఎమ్మెల్యే రాపాక ఏకంగా జగన్ ఫ్లెక్సీకి పాలాభిషేకం చేయడంపై జనసేన శ్రేణులు మండిపడుతున్నాయి. జనసేన పార్టీ నుంచి గెలిచిన ఒకే ఒక్క ఎమ్మెల్యే అయిన రాపాక వరప్రసాద్‌కు పార్టీలో వరుసగా అవమానాలు జరుగుతున్నాయి. ఇటీవల నాదెండ్ల మనోహార్ ఓ ప్రెస్‌మీట్‌లో బొట్టు పెట్టి పిలవాలా అని రాపాకపై నోరుపారేసుకున్నాడు. పవన్ కల్యాణ్ పక్కనే ఉన్న నాదెండ్లను మందలించలేదు. రాపాకను కనీసం పట్టించుకోలేదు. దీంతో రాజోలు ఎమ్మెల్యే క్రమంగా వైసీపీకి దగ్గరవుతున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఇవాళ రాపాక జగన్ ఫ్లెక్సీకి పాలాభిషేకం చేసి ప్రశంసల వర్షం కురిపించాడు. ప్రస్తుతం రాపాక వ్యవహారం జనసేన పార్టీలో తీవ్ర చర్చనీయాశంగా మారింది.
