టీడీపీ నేతలు వరుసగా కేసుల్లో చిక్కుకుంటున్నారు. తాజాగా గన్నవరం టీడీపీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఫోర్జరీ కేసులో ఇరుక్కున్నారు. గత ఏప్రిల్ లో జరిగిన ఎన్నికల సమయంలో ఎమ్మార్వో సంతకాన్ని ఫోర్జరీ చేసినట్లు బాపులపాడు తసీల్దార్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎమ్మెల్యే వంశీ మీద హనుమాన్ జంక్షన్ పోలీసులు కేసు నమోదు చేసారు. వివరాల్లోకి వెళితే..2019 సార్వత్రిక ఎన్నికల్లో గన్నవరంలో సిట్టింగ్ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి, వైసీపీ అభ్యర్థి యార్లగడ్డ మధ్య గట్టిపోటీ నెలకొంది. ఈ నేపథ్యంలో ఎలాగైనా మళ్లీ గెలవాలని భావించిన వంశీ ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నా లెక్కచేయక…నిబంధనలు ఉల్లఘించి మరీ.. తన అనుచరులతో కలిసి పెరికీడు, కొయ్యూరు, కోడూరుపాడు, బాపులపాడుతో సహా.. అనేక గ్రామాల్లో పేదలకు నకిలీ ఇళ్ల పట్టాలను వేల సంఖ్యలో పంపిణీ చేసారు. అయితే ఇందు కోసం వంశీ గతంలో అక్కడ పని చేసి వెళ్లిన బాపులపాడు మండల తహసీల్దార్ సంతకాన్ని ఫోర్జీరీ చేసినట్లు అప్పట్లోనే విమర్శలు వచ్చాయి. ఇటీవల ఈ వ్యవహారం వెలుగులోకి రావటంతో రెవిన్యూ అధికారులు ప్రాధమికంగా విచారణ జరిపారు. ఎమ్మెల్యే వంశీ ఎమ్మార్వో సంతకాన్ని ఫోర్టరీ చేసినట్లు గుర్తించిన బాపులపాడు తహసీల్దార్ నరసింహారావు హనుమాన్ జంక్షన్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేవలం ఎన్నికల్లో గెలవటంతో కోసమే ఇలా నకిలీ పట్టాలను పేదలకు అందించారని ..అందునా ప్రభుత్వ అధికారి సంతకం ఫోర్జరీ చేసారని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు.దీంతో ఎమ్మెల్యే వంశీతో పాటుగా ఆయన ప్రధాన అనుచరుల మీద హనుమాన్ జంక్షన్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఇదిలా ఉంటే ఎన్నికల్లో వంశీ కేవలం 780 ఓట్ల సల్ఫ మెజారిటీతో గెలుపొందడం గమనార్హం. దీన్ని బట్టి వేల సంఖ్యలో నకిలీ ఇళ్లపట్టాలు ఓటర్లకు ఇవ్వడం వంశీ గెలుపుకు దోహదపడిందని చెప్పవచ్చు. కాగా ఇప్పటికే టీడీపీ నేత చింతమనేని 50కు పైగా కేసుల్లో ఇరుక్కుని జైళ్లో ఉన్నారు. ఇక కూన రవి కుమార్, యరపతినేని, సోమిరెడ్డి, కోడెల శివరామ్ లాంటి వారు కేసులు ఎదుర్కొంటున్నారు. తాజాగా వల్లభనేని వంశీపై కూడా కేసు నమోదు కావడం ఏపీ రాజకీయవర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
