ఎన్నికల ముందు పాదయాత్రలో హామీ ఇచ్చినట్లుగా ఒక్కొక్క పథకాన్ని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రజల్లోకి విజయవంతంగా తీసుకువెళ్తున్నారని వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి తెలిపారు. పథకాలు అమలవుతూ క్షేత్రస్థాయిలో అందరికీ చేరుతుండటంతో చంద్రబాబు వెన్నులో వణుకుపుడుతోందని బుధవారం ట్విట్టర్లో వ్యాఖ్యానించారు. పథకాల ఫలాలు లబ్ధిదారులకు చేరుతుండటంతో చంద్రబాబుతో పాటు ఆయన మోచేతులు నాకే బృందానికి గుండెదడ పెరిగి పోయిందని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పథకాలపై ప్రజల నుండి వస్తున్న అనూహ్య స్పందనను చూసి జగన్ మడమ తిప్పాడు అని కొందరు, నాలుగు నెలలకే డీలా పడ్డారు అని మరికొందరు పనికిమాలిన విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. వైఎస్ రైతు భరోసాలో లబ్ధిదారుల జాబితా వెలువడి గ్రామాల్లో పండగ వాతావరణం నెలకొంటే, చంద్రబాబు మాత్రం పులివెందుల పంచాయతీ, జే ట్యాక్స్ అంటూ ఏడుపు రాగాలు తీస్తున్నారని ఆరోపించారు. చంద్రబాబునాయుడి మానసిక స్థితిపై ఆ పార్టీ నాయకులే తీవ్ర ఆందోళన చెందుతున్నారని, ఎప్పుడేం మాట్లాడుతున్నారో తెలియడం లేదంటూ విమర్శించారు. నిరాశానిస్పృహలతో పాటు ఎప్పటికీ తనకు అధికారం దక్కదనే భీతి చంద్రబాబును కుంగదీస్తోందని వ్యాఖ్యానించారు.
