‘సూరీ… వ్యక్తిగత స్వార్ధం కోసం నీచ రాజకీయాలు చేయడం మానుకో.. గత ఐదేళ్లలో వ్యవస్థలను నిర్వీర్యం చేశావు.. అంతులేని అవినీతి చేశావు. నీ అవినీతిపై విచారణను తప్పించుకునేందుకు ధర్మవరంలో అలజడులు సృష్టిస్తున్నావు.. పోలీసులు, అధికారులపై రాళ్లతో దాడులు చేయించి విధ్వంసానికి కుట్రపన్నుతున్నావు. నిరాధార ఆరోపణలు చేసి బురద జల్లాలని చూస్తే సహించేది లేదు. ఇందుకు తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది’ అని ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి హెచ్చరించారు. మాజీ ఎమ్మెల్యే వరదాపురం సూరి తనపై చేస్తున్న అనైతిక ఆరోపణలపై నిప్పులు చెరిగారు. మంగళవారం ధర్మవరంలోని తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కేతిరెడ్డి మాట్లాడారు. గడిచిన ఐదేళ్ల టీడీపీ పాలనలో అంతులేని అవినీతి జరిగిందన్నారు. వేసిన రోడ్లకు, కాల్వలకు మళ్లీ మళ్లీ బిల్లులు చేసుకొని వ్యవస్థలను నిర్వీర్యం చేశారని మండిపడ్డారు. పోలీసులను ఫ్లెక్సీలకు కాపలాదార్లుగా పెట్టిన నీచమైన సంస్కృతి వరదాపురం సూరి హయాంలో జరిగిందన్నారు. టీడీపీ హయాం మొత్తం అమాయక వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు, హోదా ఉద్యమకారులపై అక్రమ కేసులు పెట్టారన్నారు. అందుకే సార్వత్రిక ఎన్నికల్లో తగిన మూల్యం చెల్లించుకున్నారని విమర్శించారు. తాను ఎమ్మెల్యేగా ఎన్నికైనప్పటి నుంచి వ్యవస్థలను ప్రక్షాళన చేసి మీరు చేసిన తప్పులను సరిదిద్దుతున్నామని చెప్పారు.
