హిందూ ధర్మ ప్రచారయాత్రలో భాగంగా విశాఖ శ్రీ శారదాపీఠం ఉత్తరాధికారి శ్రీ శ్రీ శ్రీ స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామి అక్టోబర్ 13, సోమవారం నాడు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో అడుగుపెట్టారు. యాత్ర నిమిత్తం ఖమ్మం నగరానికి విచ్చేసిన శ్రీ స్వాత్మానందేంద్రకు గాయత్రి గ్రానైట్స్ అధినేత వద్దిరాజు రవిచంద్ర సతీసమేతంగా ఘనస్వాగతం పలికారు. బురాన్‌పురం నుంచి గాయత్రి రవి ఇంటివరకు మహిళల కోలాట నృత్యాలు, సన్నాయి వాయిద్యాల నడుమ ఊరేగింపుగా తీసుకువచ్చారు. వేద పండితుల మంత్రోచ్చరణాల మధ్య పూర్ణ కుంభంతో ఎదురేగి వద్దిరాజు రవిచంద్ర దంపతులు స్వామి వారిని తమ నివాసంలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా పూలు, పండ్లు సమర్పించి స్వామివారిని ఘనంగా సత్కరించారు. వద్దిరాజు దంపతులకు స్వామీజీ ఆశీస్సులు అందించారు. నాలుగు రోజుల పాటు గాయత్రి రవి ఇంట్లో స్వామివారు శ్రీ రాజశ్యామల అమ్మవారికి పీఠపూజలు నిర్వహిస్తారు. తదనంతరం జిల్లాలోని పలు దేవాలయాలను దర్శించి, ధర్మ ప్రచారం గావిస్తారు. ఈ క్రమంలో సోమవారం సాయంత్రం గాయత్రి రవి ఇంట్లోరాజశ్యామలదేవికి పీఠపూజలు చేసి, భక్తులకు అనుగ్రహ భాషణం చేసిన అనంతరం ఖమ్మం నగరం, ట్రంక్ రోడ్‌లోని శ్రీ గుంటుమల్లేశ్వర స్వామి ఆలయాన్ని, కాల్వఒడ్డులోని స్వామివారు దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ హిందూ ధర్మ ప్రచారయాత్ర ఉమ్మడి ఖమ్మం జిల్లాలో నాలుగు రోజుల పాటు సాగుతుంది. ఈ సందర్భంగా అక్టోబర్ 18 న శుక్రవారం నాడు స్థానిక రాజ్‌పథ్ ఫంక్షన్ హాల్‌లో గాయత్రి రవి – విజయలక్ష్మీ దంపతుల ఆధ్వర్యంలో విశాఖ శ్రీ శారదాపీఠాధిపతులు జగద్గురు శ్రీ శ్రీ శ్రీ స్వరూపానందేంద్ర సరస్వతి మహాస్వామి, ఉత్తరాధికారి శ్రీ శ్రీ శ్రీ స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామివార్లకు పుష్పాభిషేకం కార్యక్రమం నిర్వహించబడుతుంది. ధర్మ ప్రచారయాత్రలో భాగంగా స్వామివారు కూసుమంచి , గణపేశ్వర ఆలయం, ఖమ్మం నగరంలోని గుంటు మల్లేశ్వర స్వామి గుడి, స్థంభాద్రి లక్ష్మీ నర్సింహ స్వామి గుట్ట , ప్రఖ్యాతి గాంచిన భద్రాద్రి శ్రీ సీతా రామచంద్ర స్వామి దేవస్థానం, జమలాపురం వేంకటేశ్వరస్వామి గుడి వంటి పలు దేవాలయాలను దర్శిస్తారు. కాగా ధఱ్మ ప్రచార నిమిత్తం ఖమ్మం నగరానికి విచ్చేసిన శ్రీ స్వాత్మానందేంద్రను గాయత్రి రవి నివాసంలో శ్రీ స్వాత్మానందేంద్ర స్వామివారిని పలువురు ప్రముఖులు దర్శించుకుని ఆశీస్సులు పొందారు. స్వామివారి ఆశీస్సులు తీసుకున్నవారిలో సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య, ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మి నారాయణ, వ్యాపార, రాజకీయ ప్రముఖులు రాయల నాగేశ్వరరావు, పారా నాగేశ్వరరావు, వేములపల్లి వెంకటేశ్వర రావు, ఆకుల సతీష్, శీలం శెట్టి వీరభద్రం, తోట రామారావు, శెట్టి రంగారావు తదితరులు ఉన్నారు. విశాఖ శ్రీ శారదాపీఠం ఉత్తరాధికారిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం హిందూ ధర్మ ప్రచారయాత్రను తెలంగాణ నుంచి చేపట్టి, ఇవాళ ఉమ్మడి ఖమ్మం జిల్లాకు విచ్చేసిన శ్రీ స్వాత్మానందేంద్రకు భక్తులు ఘనస్వాగతం పలికారు. ఈ మేరకు స్వామివారికి ఆహ్వానం పలుకుతూ ఖమ్మం నగరమంతటా హోర్డింగ్‌లు, ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. స్వామివారి ఆగమనం సందర్భంగా ఖమ్మం నగరంలో ఆధ్యాత్మిక శోభ నెలకొంది. ఈ కార్యక్రమంలో ఖమ్మం నగర ప్రముఖులు, స్వామివారి హిందూ ధర్మ ప్రచారయాత్ర రెండు తెలుగు రాష్ట్రాల సమన్వయకర్త, దరువు ఎండీ సీహెచ్ కరణ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.