ప్రభుత్వ సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాల్లో మైనార్టీలను భాగస్వామ్యం చేసింది టీఆర్‌ఎస్ ప్రభుత్వమేనని రాష్ట్ర విద్యుత్‌శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్‌రెడ్డి అన్నారు. సూర్యాపేట జిల్లా కోదాడ నియోజకవర్గ పరిధిలోని చిలుకూరు మండల కేంద్రంలో ముస్లిం మైనార్టీల ఆత్మీయ సమ్మేళనం మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. 2014 తర్వాత వచ్చిన మార్పులను ముస్లిం మైనార్టీలు గుర్తించాలన్నారు. మైనార్టీ గురుకుల విద్యాలయాలకు అంకురార్పణ జరిగింది ఈ గడ్డ మీదనే అన్నారు. ప్రభుత్వమే ముందుకు వచ్చి రంజాన్ పండుగను నిర్వహించడం యావత్ భారతదేశంలో తెలంగాణ రాష్ట్రంలోనే మొట్టమొదటిసారి జరిగిందన్నారు. 2014 తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా అభివృద్ధి, సంక్షేమం పరుగులు పెడుతుందన్నారు. గులాబీ జెండాతోనే అభివృద్ధికి పునాలు పడ్డాయన్నారు. కాగా హుజుర్ నగర్, కోదాడలో మాత్రం ఇప్పటికి యధాతథస్థితి కొనసాగుతుందన్నారు. ఆ ప్రాంతాల్లో ఇప్పటికి అభివృద్ధి ఆనవాళ్లు కనిపించడం లేదన్నారు. హుజుర్ నగర్ అభివృద్ధికా అన్నట్లు ఉపఎన్నికలు మన ముందుకు వచ్చాయన్నారు. మీరు వేసే ఓటుతోటే అభివృద్ది ముడిపడి ఉందన్నారు. 20 ఏండ్లుగా అధికారంలో ఉండి కూడా కోదాడ, హుజుర్‌నగర్‌లను ఉత్తమ్ అభివృద్ధి పరచలేకపోయారన్నారు. అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్నందునే కోదాడలో ఆమెను ఓడించారన్నారు. హుజుర్‌నగర్‌లో గులాబీజెండా ఎగరడం ఖాయమన్నారు.