ఏపీ పోలీసులు వైయస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వానికి తొత్తులుగా పని చేస్తున్నారంటూ గత కొద్ది రోజులుగా టీడీపీ అధినేత చంద్రబాబుతో సహా టీడీపీ నేతలు అడ్డగోలుగా విమర్శలు చేస్తున్నారు. తాను అధికారంలో ఉండగా పోలీసులతో నాటి ప్రతిపక్ష నాయకుడు వైయస్ జగన్, వైసీపీ నేతలను నానా ఇబ్బందులు పెట్టించిన చంద్రబాబు..ఇప్పుడు అదే పోలీసులపై విరుచుకుపడుతున్నాడు. ఏకంగా డీజీపీ స్థాయి వ్యక్తులు అధికారపార్టీ నేతలు ఏం చెబితే అదే చేస్తున్నారంటూ చంద్రబాబు తీవ్ర ఆరోపణలు చేశాడు. వైసీపీకి అనుకూలంగా వ్యవహరించే పోలీసులు ఆ పార్టీల చేరాలని చంద్రబాబు ఓ ఉచిత సలహా పడేశాడు. ఇక చంద్రబాబుకు వీరభక్తుడు అయిన టీడీపీ సీనియర్ నేత వర్ల రామయ్య అయితే పోలీసులపై అక్కసు వెళ్లగక్కాడు. అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్న డీజీపీ, ఇతర పోలీస్ అధికారుల జాతకాలు నా దగ్గర ఉన్నాయి…తస్మాత్ జాగ్రత్త అంటూ హెచ్చరికలు జారీ చేశాడు. వర్ల అనుచిత వ్యాఖ్యలపై ఏపీ పోలీస్ అధికారుల సంఘం తీవ్రంగా స్పందించింది. పోలీసుల మీద అవాకులు, చవాకులు పేలుతున్న టీడీపీ నేత వర్ల రామయ్య..నోరు అదుపులో పెట్టుకోవాలని ఏపీ పోలీస్ అధికారుల సంఘం అధ్యక్షుడు శ్రీనివాస్ సీరియస్‌గా వార్నింగ్ ఇచ్చారు. పోలీసులపై ఇష్టం వచ్చినట్లు అసత్యప్రచారాలు చేస్తారా అంటూ మండిపడ్డారు.ఇక పోలీసులపై ఎవరైనా అసత్య ప్రచారం చేసినా, దూషించినా.. న్యాయ పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. ‘పోలీసుల జాతకాలు నీ వద్ద ఉన్నాయని మాట్లాడుతున్నావ్.. నీ జాతకం మొత్తం నా దగ్గర ఉంది ఖబర్దార్’ అంటూ శ్రీనివాస్ హెచ్చరించాడు. అదే విధంగా పోలీసు అధికారుల సంఘం కార్యదర్శి మస్తాన్ ఖాన్ మాట్లాడుతూ.. రాజకీయ పబ్బం గడుపుకోడానికి టీడీపీ నాయకులు అసత్య ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. పోలీస్ వ్యవస్థ ఎవరికీ తలొగ్గి పనిచేయదని పేర్కొన్నారురు. పోలీసులను కించపరిచేలా మాట్లాడటం ఫ్యాషన్ అయిపోయిందని, తమకు అనవసరంగా పార్టీ రంగు పులమడం సరికాదని హితవు పలికారు. 20 ఏళ్లు పోలీస్ అధికారిగా పని చేసిన వర్ల రామయ్య…ఇలా దిగజారి మాట్లాడడం ఏమాత్రం సబబుగా లేదని పోలీస్ అధికారుల సంఘం తీవ్రంగా ఆక్షేపించింది. మొత్తంగా ఒక పోలీస్ అధికారిగా పని చేసి, కేవలం చంద్రబాబు మెప్పు కోసం వర్ల రామయ్య లాంటి సీనియర్ నేత డీజీపీ స్థాయి అధికారిపై, పోలీసులపై దిగజారుడు వ్యాఖ్యలు చేయడం నిజంగా సిగ్గుచేటు. మరి పోలీసు అధికారుల సంఘం వార్నింగ్‌కు వర్ల రామయ్య ఎలా స్పందిస్తాడో చూడాలి.