రాష్ట్రంలోని అన్ని గ్రామాల్లో పచ్చదనం- పరిశుభ్రత పెంచటమే లక్ష్యంగా చేపట్టిన ముఫ్పై రోజుల కార్యాచరణలో అటవీ శాఖ మంచి పనితీరును కనపరిచింది. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు ప్రతీ గ్రామానికి హరిత కార్యాచరణ ప్రణాళికను (విలేజ్ లెవల్ గ్రీన్ ప్లాన్) సిద్దం చేశారు. ఒక్కో గ్రామంలో ఏమేరకు ఖాళీ స్థలాలు అందుబాటులో ఉన్నాయి. ఎన్ని మొక్కలు నాటవచ్చు. ప్రస్తుత యేడాదిలో పాటు రానున్న సంవత్సరాల్లో ఎన్ని మొక్కలు నాటవచ్చు, వాటిని బతికించేందుకు ఎలాంటి కార్యాచరణతో ముందకు వెళ్లాలి అనేది గ్రామస్థాయిలో నిర్ణయాలు జరిగాయి. అలాగే గ్రామస్థులు కోరిన మొక్కలనే సరఫరా చేసేందుకు కూడా ప్రణాళికలు రూపొందించటంతో పాటు అందుబాటులో ఉన్నంతవరకు మొక్కలను అటవీ శాఖ సరఫరా చేసింది. నర్సరీల్లో మిగిలిన స్టాక్ ను వచ్చే యేడాది కోసం పెద్ద మొక్కలు సరఫరా చేసేందుకు వీలుగా పెంచాలని అటవీ శాఖ నిర్ణయించింది. అలాగే ఇప్పటిదాకా అటవీ శాఖ ఆధీనంలో ఉన్న నర్సరీలను గ్రామీణాభివృద్ది శాఖకు అప్పగించారు. ప్రతీ గ్రామంలో ఒక నర్సరీని ఏర్పాటుచేయటం, ఆ గ్రామం పేరు మీదే నర్సరీని ఏర్పాటు చేయటం కొనసాగుతోంది. (ఉదా; రామారం – రామారం తెలంగాణకు హరితహారం నర్సరీ). మొత్తం 12, 751 గ్రామ పంచాయితీలకు గాను దాదాపు అన్నింట్లో హరిత కార్యాచరణ ప్రణాళికను రూపొందించారు. 12,292 గ్రామాల్లో ఒక్కో నర్సరీ ఏర్పాటుకు స్థలం గుర్తింపు, మొక్కల పెంపకం పనులు ప్రారంభమయ్యాయి. ఇక ముఫ్పై రోజుల కార్యాచరణ ప్రణాళికలో భాగంగా చేపట్టిన పనుల విషయానికి వస్తే.. 24,244 కిలో మీటర్ల మేర గ్రామానికి దారితీసే రోడ్డు, గ్రామానికి- మరో గ్రామానికి మధ్య అవెన్యూ ప్లాంటేషన్ ను చేపట్టారు. ఇందుకోసం 80.88 లక్షల మొక్కలను నాటడం, రక్షణ చర్యలు చేపట్టడం జరిగింది. గ్రామాల్లో గుర్తించిన ఖాళీ ప్రదేశాలు, వివిధ సంస్థలకు చెందిన సామూహిక ప్రాంతాల్లో 40,522 ఎకరాల్లో బ్లాక్ ప్లాంటేషన్ లో భాగంగా రెండు కోట్ల అరవై లక్షల మొక్కలను నాటారు. ఇక ఇంటింటికి ఆరు మొక్కల సరఫరాలో భాగంగా రెండు కోట్ల ఇరవై ఆరు లక్షల మొక్కలను సరఫరా చేశారు. నాటిన ప్రతీ మొక్కను కుటుంబ సభ్యుల్లాగా భావించి పెంచాలనే అధికారులు అన్ని గ్రామాల్లో గ్రామస్థులకు ప్రత్యేకంగా విన్నవించారు. కోతులకు అటవీ ప్రాంతాల్లోనే ఆహార లభ్యత కోసం మంకీ ఫుడ్ కోర్టులను ఏర్పాటు చేస్తున్నారు. దీనిలో భాగంగా క్షీణించిన అటవీ ప్రాంతాల్లో కోతులు తినే పండ్లు, కాయకూరల మొక్కలను నాటుతున్నారు. మొదటి దశలో కామారెడ్డి, పెద్దపల్లి, జగిత్యాల జిల్లాల్లో మంకీ ఫుడ్ కోర్టులు ఏర్పాటయ్యాయి. మొత్తం మీద ముఫ్పై రోజుల కార్యాచరణలో భాగంగా తెలంగాణ వ్యాప్తంగా ఏడు కోట్ల ముఫ్పై రెండు లక్షల మొక్కలను నాటడం జరిగింది. పంచాయితీ రాజ్, అటవీ శాఖ, గ్రామ కమిటీల సమన్వయంతో రాష్ట్ర వ్యాప్తంగా పచ్చదనం పెంపుకు నిరంతర ప్రయత్నాలు ముమ్మరం అయ్యాయి.